హిమాలయాల్లో సరికొత్త పాలపిట్ట గుర్తింపు... జూతెరా సలీమలీగా పేరు

సోమవారం, 25 జనవరి 2016 (11:47 IST)
ఈశాన్య భారత్‌, చైనా పక్కనే ఉండే ప్రాంతంలో కొత్త పక్షి జాతిని ఇటీవలే గుర్తించారు. హిమాలయా అటవీ పాలపిట్టగా వ్యవహరిస్తున్న ఈ పక్షిని ప్రత్యేకమైన జాతిగా పరిశోధకులు నిర్ధారించారు. భారత్‌, స్వీడన్‌, చైనా, అమెరికా, రష్యాలకు చెందిన శాస్త్రవేత్తల బృందం ఈ అరుదైన పాలపిట్ట జాతిని కనిపెట్టారు. 
 
స్వాతంత్ర్యం వచ్చాక ఆధునిక పక్షి శాస్త్రవేత్తలు భారత్‌లో గుర్తించిన కొత్త జాతుల్లో ఇది నాలుగోది మాత్రమే. హిమాలయా అటవీ పాలపిట్ట తూర్పు హిమాలయాల్లో సర్వసాధారణంగా కనిపిస్తుంటుంది. ఇప్పటి వరకూ ప్లెయిన్‌ బ్యాక్డ్‌ త్రష్‌‌కు సంబంధించిన ఉపజాతిగా భావిస్తూ వచ్చారు. 2009లో పశ్చిమ అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఎత్తైన ప్రాంతాల్లో పక్షులపై అధ్యయనం నిర్వహిస్తున్న సందర్భంగా పెర్‌ అల్‌స్ట్రోమ్‌, శశాంక్‌ దాల్విలు తొలిసారిగా ఈ పక్షి జాతిని గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు. 
 
ఏడు దేశాల్లో 15 ప్రదర్శనశాలల్లో నమూనాలపై అధ్యయనం చేసిన తర్వాత ఇది కొత్త జాతి అని నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు. భారత పక్షిశాస్త్ర పితామహుడు డాక్టర్‌ సలీం అలీ సేవలకు గుర్తింపుగా దీనిని "జూతెరా సలీమలీ" అనే శాస్త్రీయ నామంతో వ్యవహరిస్తున్నారు. భారత్‌లో పక్షిశాస్త్రంలో చేయాల్సిన కృషి ఎంతో ఉందని ఈ అసాధారణ పరిశోధన తెలియజేస్తోందని బాంబే నేచురల్‌ హిస్టరీ సొసైటీ (బీఎన్‌హెచ్‌ఎస్‌)కు చెందిన అసద్‌ రహ్మానీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి