సింధూ నాగరికతకు ప్రతీక లడక్

మంగళవారం, 20 సెప్టెంబరు 2011 (18:32 IST)
జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలోని లడక్‌ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకత ప్రపంచంలోని మరే ప్రాంతానికీ లేదనే చెప్పాలి. ప్రపంచంలో ఎత్తయిన పర్వతశ్రేణుల జాబితాలో ఉన్న హిమాలయాలు, కారకోరమ్‌ మధ్య విస్తరించుకుని ఉన్న ప్రాంతమే లడక్‌. లడక్‌లోని కార్గిల్‌ ప్రాంతం సముద్ర మట్టానికి తొమ్మిది వేల అడుగుల ఎత్తున ఉండగా, కారకోరమ్‌ సమీపాన ఉన్న సాసెర్‌ కంగ్రి ప్రాంతం 25 వేల అడుగుల ఎత్తులో ఉంది. హిమాలయాల నుంచి వచ్చే శీతలగాలుల కారణంగా ఏడాది పొడవునా వాతావరణం చల్లగా ఉంటుంది.

ఒకప్పుడు నదీనదాలతో పచ్చిక బయళ్ళతో అలరారిన లడక్‌ ప్రాంతం ఇప్పుడు తన మునుపటి వైభవాన్ని కోల్పోయింది. శీతాకాలంలో పర్వతప్రాంతాలపై ఉన్న మంచు కరగడం ద్వారా వచ్చే నీరే లడక్‌ ప్రాంత ప్రజల వ్యవసాయానికి ప్రధాన ఆధారంగా మారింది. వర్షాలు కురిసినా అవి అననుకూల వర్షాలు కావడంతో అంతగా ఉపయోగం ఉండదు. నిజం చెప్పాలంటే ఇక్కడి ప్రజలు వర్షాలు కురవాలని కోరుకోరు. ఎండ బాగా కాయాలనే కోరుకుంటారు.

ఎందుకంటే ఎండ బాగా కాస్తే మంచు కరిగి నీరుగా మారి తమ పంటలకు అందుతుందని. వారి ప్రార్థనలను ఆ దేవుడు ఆలకించాడా అన్నట్టు- ఇక్కడ ఏడాదిలో 300 రోజులు ఎండ విరగ కాస్తుంది. అయితే వేసవికాలంలో 27 డిగ్రీల సెల్సియస్‌ ఉండే ఉష్ణోగ్రత శీతాకాలంలో మైనస్‌ 20 డిగ్రీలకు పడిపోతుంది. అయినప్పటికీ గాలిలో తేమ తక్కువగా వుంటుంది. అందువల్ల సూర్యకిరణాలు చొచ్చుకువస్తాయి.

చూడాల్సిన ప్రదేశాలు:
సింధులోయ నాగరికత చిహ్నాలెన్నింటినో లడక్‌లో చూడవచ్చు. లడక్‌లోని లెహ్‌ ప్రాంతానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉంది. 17వ శతాబ్దంలో సెంగె నంగ్యాల్‌ ఇక్కడ నిర్మించిన తొమ్మిదంతస్తుల రాజసౌధం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. ఇండస్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న షె పట్టణంలో ఎన్నో రాజభవనాలు, పురాతన ఆలయాలు ఉన్నాయి.

వీటిలో చాలా భవనాలను 1980లో పునర్‌నిర్మించారు. దీనికి సమీపంలోనే ఉన్న బాస్గో, టంగ్‌‌మాస్కాంగ్‌ ప్రాంతాలు 15వ శతాబ్దంలో ఒక వెలుగు వెలిగాయి. అప్పటి వైభవానికి చిహ్నంగా శిథిలావస్థలో ఉన్న కట్టడాలు, ఆలయాలు ఈ ప్రాంతంలో కనబడతాయి.

లడక్‌ ప్రాంతాన్ని గతంలో ఎందరో రాజులు చిన్నా చితకా రాజ్యాలు ఏర్పరచుకుని పాలించారు. వారిలో ఫియాంగ్‌, హెమిస్‌, చిబ్రా అనేవారు ప్రసిద్ధులు. బౌద్ధమతానికి ముందు వీరు పలు మతాలకు ప్రాణం పోసినట్టు దాఖలాలు ఉన్నాయి. లడక్‌ ప్రాంతంలో అనేక తెగలు కూడా చిరకాలం వర్థిల్లాయి. ఆ సమయంలో ఎన్నో దేవాలయాలను సైతం నిర్మించారు.

ఇలాంటి వాటిలో అల్చి ప్రార్థనాస్థలం ఒకటి. ఐదు దేవాలయాల సమూహమిది. ఆలయాల లోపల అద్భుతమైన వర్ణ చిత్రాలు ఆశ్చర్యం గొలుపుతాయి. ఇవి 11, 12 శతాబ్దాలకాలం నాటివిగా చెబుతారు. ఈ ఆలయంలో పూజాదికాలు నిలిచిపోయి చాలా ఏళ్ళు అవుతున్నా, లికిర్‌ మతప్రముఖులు కొందరు వీటిని ఇప్పటికీ సంరక్షిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి