భారతదేశంలో సూర్యుడు మొదటసారిగా ఉదయించే ప్రాంతమైన అరుణాచల్ ప్రదేశ్‌లో హిమాచల్ పర్వతాలపై ఉంది తవాంగ్. అరుణాచల్ ప్రదేశ్‌లో బౌద్ధులు అధికం. దీనితో ఇక్కడ అతి ప్రాచీన బౌద్ధ ఆశ్రమం ఉంది. తవాంగ్ హిమాలయ పర్వతాలపై దాదాపు 12వేల ఆడుగుల ఎత్తున ఉంది. తవాంగ్ అంటే ఎంచుకున్న గుర్రం. తవాంగ్‌లో టిబెటన్ల సంఖ్య ఎక్కువ. టిబెటన్లు ఎప్పుడూ ఇక్కడ ప్రార్ధనలు చేస్తూ బౌద్ధమత ఆరాధనలో నిమగ్నులవుతారు.
చూడవలసిన ప్రాంతాలు తవాంగ్ యుద్ధ స్మారకం భారత-చైనాల మధ్య 1962లో జరిగిన యుద్ధంలో చైనా సైనికులను ఒంటరిగా పోరాడిన భారతీయ సైనికుడి వీరమరణం పొందిన చోట స్మారకంను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ స్మారకం సీలా పాస్‌లోని జశ్వంత్‌ఘర్‌లో ఉంది.
తవాంగ్ ఆశ్రమం బౌద్ధమతంలో మహాయాన వర్గం వారు ఇక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటుచేసుకున్నారు. లాసా తర్వాత అతి ప్రాచీన ఆశ్రమం తవాంగ్‌లో మాత్రమే ఉంది. తవాంగ్ ఆశ్రమాన్ని మెరాగ్ లామా లోడ్రీ గిమాస్ట్సో నిర్మించారు. ఈ ఆశ్రమం 1681లో నిర్మించారని అంటుంటారు. ఆశ్రమం పక్కనే బౌద్ధ సన్యాసులు నివసించేందుకు వీలుగా వసతి గృహాలు ఏర్పాటుచేశారు.
తవాంగ్ ఆశ్రమంలో ప్రాచీన గ్రంధాలయంతో పాటుగా వస్తు ప్రదర్శనశాల కూడా ఉంది. దాదాపు 500 మంది బౌద్ధ సన్యాసులకు వసతి కల్పించేది తవాంగ్ ఆశ్రమం. రాత్రిపూట తవాంగ్ ఆశ్రమాన్ని విద్యుదీప కాంతులతో చూస్తే చాలా అందంగా ఉంటుంది. ఆశ్రమంలో లోపల 8మీటర్లు ఎత్తైన బౌద్ధ విగ్రహం ఉంది. లాసాలోని పోతలా ఆశ్రమం తర్వాత అతిపెద్దది తవాంగ్ ఆశ్రమం.
ఉర్గెలింగ్ ఆశ్రమం ఆరవ దలైలామా ఉర్గెలింగ్ ఆశ్రమంలో పుట్టాడని బౌద్ధులు భావిస్తారు. ఈ ఆశ్రమం 14వ శతాబ్దం నుంచి ఉందని బౌద్ధులు అంటుంటారు. తవాంగ్ పట్టణం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉర్గెలింగ్ ఆశ్రమం ఉంది.
వసతి తవాంగ్‌లో ప్రభుత్వ, ప్రైవేటు వసతి సదుపాయాలు ఉన్నాయి.
ఎలా చేరుకోవాలి విమాన మార్గం : తేజ్‌పూర్ (320 కి.మీ.) రైలు మార్గం : రంగపార సమీపంలో రైల్వే స్టేషన్. ఈ మార్గంలో మీటర్ గేజి రైళ్లు రంగియా నుంచి నడుస్తాయి. రంగియా-గౌహతిల మధ్య దూరం 60 కి.మీ..
రహదారి మార్గం : తేజ్‌పూర్ (320 కి.మీ.), బొమిడిలా (185 కి.మీ.), దిరాంగ్ (143 కి.మీ.). తేజ్‌పూర్ నుంచి తవాంగ్‌కు చేరుకోవటానికి 13 గంటల సమయం పడుతుంది. మార్గమధ్యంలో రాత్రిపూట బొమిడిలా లేదా దిరాంగ్‌లలో బస చేయాల్సి ఉంటుంది. తవాంగ్‌కు వెళ్లే మార్గంలో 14వేల అడుగుల ఎత్తున ఉన్న సీలా పాస్ అందాలను తనివితీరా చూడవచ్చు.