పీఏసీ సమావేశం బాగానే జరిగింది: జశ్వంత్

తొలి ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) సమావేశం బాగానే జరిగిందని ఆ కమిటీ ఛైర్మన్ జశ్వంత్ సింగ్ విలేకరులతో చెప్పారు. సోమవారం జరిగిన ఈ సమావేశానికి బీజేపీ, దాని భాగస్వామ్య పక్షాల ప్రతినిధులు హాజరుకారాదని నిర్ణయించుకున్నారు. బీజేపీ, దాని భాగస్వామ్య పక్షాలు బహిష్కరించినప్పటికీ, ఈ సమావేశం బాగానే జరిగిందని, రాబోయే సమావేశాలకు వారు హాజరవతారని జశ్వంత్ పేర్కొన్నారు.

జిన్నాను ప్రశంసిస్తూ పుస్తకం రాసి ఇటీవల బీజేపీలో సంక్షోభం సృష్టించిన జశ్వంత్ సింగ్‌ను ఆ పార్టీ బహిష్కరించింది. బీజేపీ నుంచి బహిష్కరించబడినప్పటికీ, జశ్వంత్ సింగ్ ఇప్పటికీ పీఏసీ చీఫ్ హోదాలో కొనసాగుతున్నారు. ఇది పార్లమెంటరీ పదవి అని, పార్టీ పదవి కాదని జశ్వంత్ పీఏసీ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకునేందుకు నిరాకరించారు. బీజేపీ మాత్రం తమ మాజీ సీనియర్ నేతను పీఏసీ చీఫ్ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేసింది.

ఈ డిమాండ్‌ను జశ్వంత్ పట్టించుకోకపోవడంతో.. బీజేపీ, ఇతర భాగస్వామ్య పక్షాల ప్రతినిధులు తొలి పీఏసీ సమావేశాన్ని బహిష్కరించారు. బీజేపీ నేతలు సమావేశానికి హాజరుకాకపోవడంపై జశ్వంత్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ.. దీనికి సంబంధించిన నిర్ణయాలు బీజేపీ చేతుల్లోనే ఉన్నాయన్నారు.

భవిష్యత్‌లో వారు పీఏసీ సమావేశాలకు హాజరవతారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. పీఏసీలో 22 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో తొలి సమావేశానికి 15 మంది హాజరయ్యారు. ఇదిలా ఉంటే బీజేపీ లోక్‌సభ ఉపనేత సుష్మా స్వరాజ్ సోమవారం పీఏసీ ఛైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని సింగ్‌కు బహిరంగ విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిష్టాత్మక కమిటీ ఛైర్మన్ పదవి పార్టీకి సంబంధించినదని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి