ఆశలు గల్లంతు: ఆచూకీ దొరకని ఖండూ హెలికాప్టర్!!

అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి ధోర్జీ ఖండూ హెలికాప్టర్ ఆచూకీ ఎంతకీ తెలియరావడం లేదు. ఇస్రో ఉపగ్రహాలు సైతం మాయమైన హెలికాఫ్టర్ ఆచూకీ ఆనవాళ్ళను పసిగట్టలేక పోతున్నాయ్. మరోవైపు సుఖోయ్ యుద్ధ విమానాలు అణువణువూ గాలిస్తూ.. ఖండూ హెలికాఫ్టర్ కోసం విశ్వప్రయత్నాలు సాగుతున్నాయి.

ఈ హెలికాఫ్టర్ కోసం మూడో రోజూ ముమ్మర గాలింపులు జరుగుతున్నాయి. ఆకాశం మేఘావృతం కావడంతో ఏరియల్ సర్వేపై పెట్టుకున్న ఆశలు నీరుగారాయి. సోమవారం తెల్లవారుజామున బలగాలు మళ్లీ రంగంలోకి దిగాయి. ఖండూ సహా ఐదుగురు ప్రయాణిస్తున్న పవన్ హన్స్ హెలికాప్టర్ ఏఎస్-బీ 350 యూరోకాప్టర్ బీ-3 శనివారం నుంచి కనిపించకుండాప పోయిన విషయం తెల్సిందే.

తవాంగ్ నుంచి ఇటానగర్‌కు బయలుదేరిన బీ-3 టేకాఫ్ తీసుకున్న 20 నిమిషాల తర్వాత హెలికాఫ్టర్ అదృశ్యమైంది. దీన్ని గుర్తించేందుకు ఆదివారం వాయుసేనకు చెందిన రెండు సుఖోయ్ యుద్ధవిమానాలు, ఒక ఎంఐ-17 విమానం, ఆరు హెలికాప్టర్లు గగనతలం నుంచి అరుణాచల్, భూటాన్ సరిహద్దు భూతలాన్ని జల్లెడ పట్టాయి. తవాంగ్, ఇటానగర్ మార్గాన్ని అణువణువునా శోధించాయి. ఆర్మీ, ఎస్‌ఎస్‌బీ, ఐటీబీపీ పదాతి దళాలకు చెందిన 2,400 మంది జవాన్లు కూడా అన్వేషణలో పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి