ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను కొట్టేసిన ఆర్జేడీ అధినేత లాలూ!

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి తిరిగి అధికారాన్ని కైవసం చేసుకుంటుందంటూ సీఎన్ఎన్-ఐబీఎన్ ఛానల్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కొట్టిపారేశారు. 234 సీట్లు కలిగిన బీహార్ అసెంబ్లీలో ఆర్జేడీ-ఎల్జేపీ కూటమి మూడింట రెండు వంతుల మెజార్టీ దక్కుతుందని జోస్యం చెప్పారు.

న్యూస్ ఛానల్ సర్వే ఫలితాలపై లాలూ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ తాను 1977 నుంచి రాజకీయాల్లో ఉన్నానని, ఓటర్ల నాడి ఏమిటో అందరికన్నా తనకు బాగా తెలుసన్నారు. ఓటర్లు ఎన్డీఏను తిరస్కరించారని, అందువల్ల తన అంచనాల ప్రకారం తమ కూటమికి అధికారం దక్కుతుందన్నారు.

అంతేకాకుండా, న్యూస్ ఛానళ్ళ మధ్య నెలకొన్న పోటీని తట్టుకునేందుకు మీడియా ఇలాంటి చవకబారు పనులకు పాల్పడుతోందని ఆరోపించారు. మహిళా ఓటర్లు ఎన్డీఏ వైపు మొగ్గు చూపారన్న ఎగ్జిట్ పోల్ అంచనాలకు భిన్నంగా పేద, అట్టడుగు వర్గాలకు చెందిన మహిళల మద్దతు తమ కూటమికే ఉందన్నారు. పైపెచ్చు.. తమ సంప్రదాయ ఓటర్లలో వారి సంఖ్యే అధికంగా ఉందని ఆయన గుర్తు చేశారు.

వెబ్దునియా పై చదవండి