ఎన్నికల నిర్వహణకు సరైన సమయం కాదు: ఓమర్

జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఇది సరైన సమయం కాదని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) అధ్యక్షుడు ఓమర్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ఒక న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. రాష్ట్రంలోని ఓటర్లలో లోతుగా నిరాశానిస్పృహలు నెలకొని ఉన్నాయన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్సీ పలుమార్లు విజ్ఞప్తి చేసింది.

లోయలో నెలకొన్న పరిస్థితులపై క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని ఈసీకి విన్నవించినట్టు ఎన్సీ నేతలు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో అన్ని వర్గాల వారిని భాగస్వాములు చేయాలంటే ప్రశాంత వాతావరణం నెలకొనాలని కోరుతోంది. లేని పక్షంలో ఎన్నికలు నిర్వహించినా ఫలితం ఉండబోదని ఎన్సీ నేత అభిప్రాయపడుతున్నారు.

ఒక వేళ ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించినా తక్కువ శాతంలో ఓటర్లు పాల్గొనే అవకాశం ఉందని ఓమర్ అంటున్నారు. అలాగే ఎన్నికల తేదీల ఖరారుపై తుది నిర్ణయం తీసుకునే విషయాన్ని రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన కేంద్ర ఎన్నికల సంఘానికే వదిలి వేస్తున్నట్టు చెప్పారు.

ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులను అధికమించేందుకు ఇరు వర్గాల మధ్య శాంతి సామరస్యం నెలకొనేందుకు ఎన్సీ కీలక పాత్ర పోషించినట్టు ఓమర్ అబ్దుల్లా తెలిపారు. కాగా, ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూకాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు నవంబరు నెలాఖరులోగా నిర్వహించాల్సి ఉంది.

వెబ్దునియా పై చదవండి