ఎస్‌ బ్యాండ్ వ్యవహారంపై ప్రధాని వివరణ ఇవ్వాలి: భాజపా

ఎస్-బ్యాండ్ స్పెక్ట్రమ్ కేటాయింపు వ్యవహారంపై తలెత్తిన వివాదంపై ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ వివరణ ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి పర్యవేక్షణలో పని చేసే భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)‌కు దేవాస్ కంపెనీకి మధ్య కుదిరిన ఒప్పందంపై వివాదం తలెత్తిన విషయం తెల్సిందే.

రెండు లక్షల పైచిలుకు ధర కలిగిన ఎస్-బ్యాండ్ రేడియోతరంగాల కేటాయింపు ఒప్పందాన్ని అతి తక్కువ ధరకు దేవాస్‌కు అప్పగించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలని భజాపా డిమాండ్ చేసింది. ఇప్పటి వరకూ వివిధ మంత్రిత్వశాఖలు, విభాగాలకే పరిమితమైన అవినీతి చివరకు ప్రధాని కనుసన్నలలో పనిచేసే విభాగాలకు కూడా సోకటం కంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదని పార్టీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ ధ్వజమెత్తారు.

2జి స్పెక్ట్రమ్ వివాదం ఒక కొలిక్కి రాకముందే ఇస్రోలో జరిగిన ఈ అవినీతి వ్యవహారం బయటకు పొక్కడం దేశానికే సిగ్గుచేటన్నారు. యుపీఏ ప్రభుత్వం అవినీతిలో పీకలోతు కూరుకుపోయిందని ఆయన ఆరోపించారు. ఎస్ బ్యాండ్ కేటాయింపులో అవకతవకలు జరిగినట్లు వచ్చిన వార్తలపై సంతృప్తికరమైన వివరణలు ఇవ్వకుండా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ముఖం చాటేస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. అందువల్ల ప్రధానమంత్రే స్వయంగా వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

వెబ్దునియా పై చదవండి