ఒమర్‌ వ్యాఖ్యలకు నిరసనగా 8న జమ్మూ కాశ్మీర్ బంద్‌

భారత్‌లో కాశ్మీర్‌ విలీనంపై ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా భారతీయ జనతా పార్టీ (బిజెపి) నవంబర్ 8న రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. జమ్మూలో 'దర్బార్‌ మూవ్‌' సంప్రదాయం తర్వాత నవంబర్ 8న శీతాకాలం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి ప్రారంభించండ జరుగుతుంది. అయితే ఒమర్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఆ రోజునే భాజాపా కూడా బంద్‌కు పిలుపునివ్వడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

భాజాపా రాష్ట్ర అధ్యక్షుడు శంషేర్‌ సింగ్‌ మన్హాస్‌ మాట్లాడుతూ.. నవంబర్‌ 8న ఇక్కడ పౌర సచివాలయం ప్రారంభం సందర్భంగా జమ్మూలో ముఖ్యమంత్రికి నిరసనలతో స్వాగతం పలుకబోతున్నామని, భారత్-కాశ్మీర్ విలీనంపై ఒమర్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే ఈ బంద్‌కు పిలుపునిచ్చామని చెప్పారు.

అత్యంత గౌరవప్రదమైన పదవిలో ఉండి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికై రాష్ట్రంలో ముఖ్య పదవిలో ఉన్న సీఎం వేర్పాటువాద వ్యాఖ్యలు చేయడం విచారకరమని ఆయన అన్నారు. ఈ అంశంపై ఒమర్‌ వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పి, తన పదవికి రాజీనామా చేయాలని మన్హాస్ డిమాండ్ చేశారు.

అంతే కాకుండా.. ఒమర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు సైతం పెదవి మెదపకపోవడాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ నిరసన కేవలం ఒమర్ వ్యాఖ్యలపై మాత్రమే కాదని, కాంగ్రెస్ పాలన విధానాలకు వ్యతిరేకంగా ఈ ఆందోళన చేపడుతున్నామని ఆయన అన్నారు. ఒమర్‌ వ్యాఖ్యలకు నిరసనగా మరో వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని శంషేర్‌ సింగ్‌ చెప్పారు.

వెబ్దునియా పై చదవండి