గుజరాత్ రాష్ట్రాన్ని కుదిపేసిన కల్తీ మద్యం విషాదం ఇప్పట్లో సమసి పోయేలా కనిపించడం లేదు. ఈ మద్యాన్ని సేవించి మరణించిన వారి సంఖ్య శుక్రవారానికి 103కు చేరుకుంది. మరో 200 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగానే ఉంది. కల్తీ మద్యం మృతుల సంఖ్య పెరగవచ్చు. కొందరికి డయలాసిస్ పరీక్షలు జరుగుతున్నాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.
ఈ విషాదం జరిగిన తర్వాత సూరత్, వల్సాద్, భరుచ్, వఢోదర వంటి జిల్లాలో కల్తీమద్యం తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. అయితే మరికొన్ని జిల్లాల సరిహద్దు రాష్ట్రాల్లో మాత్రం సారా నిషేధం లేదు. ఫలితంగా ఇక్కడ నుంచి సరిహద్దు జిల్లాల్లోకి సారాను అక్రమంగా తరలిస్తున్నారు.
ఇదిలావుండగా, శుక్రవారం 800 మంది సారా తయారీదార్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సారా తయారీ కేంద్రానికి సూత్రధారిగా భావిస్తున్న హరిశంకర్ కహార్ అలియాస్ హరి ఓంను పోలీసులు అరెస్టు చేసి సంఘ వ్యతిరేక చట్టం కింద అరెస్టు చేశారు.
ఈ విషాద సంఘటన గుజరాత్‌లోని నరేంద్ర మోడీ సర్కారును కుదిపేస్తోంది. అటు ప్రతిపక్షాలతో పాటు... ఇటు బాధిత కుటుంబాల ప్రజలు తీవ్రస్థాయిలో ప్రభుత్వ పనితీరుపై విరుచుకు పడుతున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగిందని వారు ఆరోపిస్తున్నారు.