కాశ్మీరీ యువతి రుక్సానాకు బ్రేవరీ అవార్డు

బుధవారం, 7 అక్టోబరు 2009 (20:31 IST)
జమ్ము కాశ్మీర్‌కు చెందిన సాహస యువతి రుక్సానా కౌసర్‌కి కేంద్ర ప్రభుత్వం బ్రేవరీ అవార్డును ఇవ్వనుంది.

జమ్మూ కాశ్మీర్‌కు చెందిన రుక్సానా కౌసర్‌కు భారతదేశం అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్రేవరీ అవార్డును ఇవ్వనున్నామని కేంద్ర హోం శాఖామంత్రి పి. చిదంబరం ముంబైలో బుధవారం ప్రకటించారు.

గత నెల 27వ తేదీ దేశవ్యాప్తంగా విజయదశమి వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో తీవ్రవాదులు రజౌరీ జిల్లాలోని రుక్సానా ఇంటిపై దాడిచేశారు. ఆమె తల్లిని సైతం చితకబాదారు. పరిసర ప్రాంతాల వివరాలివ్వాలని వారిని భయపెట్టారు.

తీవ్రవాదుల చర్యలను చూసి భయపడక మొక్కవోని ధైర్యంతో సోదరునితో కలిసి వారి దగ్గరున్న తుపాకీని లాక్కున్న రుక్సానా వారిపైనే కాల్పులు జరిపింది.

ఆమె జరిపిన కాల్పుల్లో అబూ ఒసామా అనే తీవ్రవాది అక్కడికక్కడే మృతిచెందాడు. మరో తీవ్రవాది తన ప్రాణాలను కాపాడుకునేందుకు అక్కడినుంచి పారిపోయాడు.

అబల సబలగా నిరూపించుకునేందుకు రుక్సానా ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించిందని, రుక్సానాను తాను అభినందించానని, ఆమెకు పూర్తి భద్రత కల్పిస్తున్నామని చిదంబరం చెప్పారు.

వెబ్దునియా పై చదవండి