కోయంబత్తూరు హోటల్‌ను ధ్వంసం చేస్తాం: అల్‌ఖైదా

FILE
కోయంబత్తూరులోని ఓ హోటల్‌ను బాంబు పేలుడుతో ధ్వంసం చేస్తామని ప్రముఖ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా హెచ్చరించింది. కోయంబత్తూరులో జూన్ 23వ తేదీ నుంచి ప్రాచీన తమిళ భాషపై అంతర్జాతీయ సదస్సు జరుగనుండటంతో.. కోవైలోని ఓ ప్రసిద్ధ హోటల్‌ను పేల్చి వేస్తామని అల్‌ఖైదా ఇ-మెయిల్ ద్వారా బెదిరించింది.

ప్రాచీన తమిళభాషపై జూన్ 23వ తేదీన జరుగనున్న అంతర్జాతీయ సదస్సుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సదస్సులో ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి ఈ సదస్సుకు హాజరయ్యే ప్రముఖులపై అల్‌ఖైదా కన్నేసినట్లు సమాచారం.

ఇందులో భాగంగా.. కోయంబత్తూరు స్టేషన్, గీతాహాల్ రోడ్డులో గల హోటల్‌కు అల్‌ఖైదా పేరిట హెచ్చరికలు అందాయని కోయంబత్తూరు పోలీసులు తెలిపారు. అల్‌ఖైదా హిట్ లిస్టులో కోయంబత్తూరు హోటల్ ఉందని, అందుచేత తప్పకుండా హోటల్‌ను బాంబుతో పేల్చి వేస్తామని ఆ ఇ-మెయిల్‌లో పేర్కొన్నట్లు హోటల్ అధికారులు పోలీసులకు తెలియజేశారు. ఈ విషయమై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇ-మెయిల్‌పై దర్యాప్తును క్రైం బ్రాంచ్ విభాగానికి అప్పగించారు.

వెబ్దునియా పై చదవండి