చివరి టెలిగ్రామ్ రాహుల్ గాంధీకి: టెలిగ్రామ్ సేవలకు ఇక సెలవు

FILE
టెలిగ్రాం సేవలు ముగిసిపోయాయి. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఎంతో మందికి 163 సంవత్సరాల నుంచి కోట్ల మెసేజ్‌లను మోసుకుని వెళ్లిన టెలిగ్రామ్ సేవలు ముగిసిపోయాయి.

ఈ సేవలు ముగిసిన సందర్భంగా దేశ రాజధానిలో చివరి టెలిగ్రామ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి వెళ్లటం విశేషం. జన్‌పథ్‌లోని సెంట్రల్ టెలిగ్రాఫ్ కార్యాలయం నుంచి అశ్విని మిశ్రా అనే వ్యక్తి ..... గత రాత్రి 11.45 నిమిషాలకు ఈ టెలిగ్రామ్ను పంపించాడు.

రాహుల్‌తో పాటు అతడు దూరదర్శన్ న్యూస్ డైరెక్టర్ ఎస్ఎం ఖాన్కు పంపించినట్లు తపాలా కార్యాలయ సిబ్బంది వెల్లడించారు.

టెలిగ్రాం సేవలు ఆదివారం రాత్రి తొమ్మిది గంటలతో ముగిసిపోవాల్సి ఉండగా, ప్రజలనుండి స్పందన అధికంగా ఉండడంతో జనపథ్‌లోని టెలిగ్రామ్ కార్యాలయం అర్థరాత్రి వరకూ తెరిచే ఉంచారు. టెలిగ్రామ్ పంపించేందుకు చివరి రోజు కావడంతో చాలామంది ఆదివారం రాత్రి వరకూ టెలిగ్రామ్ సెంటర్ల వద్ద పంపించాలనే కుతూహలంతో క్యూ కట్టారు.

కాగా ఇంటర్నెట్, ఎస్‌ఎంఎస్, మొబైల్ తదితర సర్వీసులతో టెలిగ్రామ్‌కు పూర్తిగా ఆదరణ తగ్గింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ సేవలను నిలిపివేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి