జార్ఖండ్‌లో భాజపా ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామా!

బుధవారం, 9 సెప్టెంబరు 2009 (17:50 IST)
జార్ఖండ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా తన శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలకు ఆ రాష్ట్ర గవర్నర్ కె.శంకర్ నారాయణ్‌కు బుధవారం సమర్పించారు. అక్టోబరులో జరుగనున్న మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ వారు తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రఘువర్ దాస్ వెల్లడించారు.

దీనిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హర్యానా, మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలను త్వరలోనే నిర్వహిస్తామని హోంమంత్రి చిదంబరం చెప్పారని గుర్తు చేశారు. అయితే, ఆయన నిండు సభలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక పోయారన్నారు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం కల్పించేందుకు గవర్నర్ శాయశక్తులా కృషి చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

కాగా, తమర్ ఉప ఎన్నికల్లో జేఎంఎం చీఫ్ శిబూ సొరేన్ ఓటమి పాలుకావడంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి జార్ఖండ్ రాష్ట్రపతి పాలన విధించారు. దీంతో గత జనవరి 19వ నుంచి రాష్ట్రపతి పాలన సాగుతోంది. ఇదిలావుండగా, 82 మంది సభ్యులు కలిగిన జార్ఖండ్ అసెంబ్లీలో భాజపాకు 2005లో 30 మంది సభ్యుల బలం ఉండేది. ప్రస్తుతం ఈ బలం 21కు తగ్గిపోయింది.

వెబ్దునియా పై చదవండి