డబ్బు ఇచ్చేస్తే న్యాయం జరిగినట్లేనా? జాలర్లపై కాల్పుల కేసులో సుప్రీం

సోమవారం, 30 ఏప్రియల్ 2012 (19:45 IST)
FILE
ఇటలీ జాలర్లను కాల్చిచంపిన కేసులో మృతుల కుటుంబాలకు పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టచెప్పి బయటపడేందుకు ఇటలీ కంపెనీ ప్రయత్నిస్తున్న అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. డబ్బులు ఇచ్చేసి మ్యాటర్ సెటిల్ చేసేసుకుందామని ఇటలీ కంపెనీ ప్రయత్నిస్తుంటే కేరళ ప్రభుత్వం ఏమి చేస్తుందంటూ ప్రశ్నించింది.

భారత సముద్ర జలాల్లో చేపల వేటలో ఉన్న ఇద్దరు భారతీయ జాలర్లను, అటుగా ప్రయాణిస్తున్న ఇటలీ నౌక సిబ్బంది కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రభుత్వం ఇటలీ సిబ్బందిని ఓడతో సహా కేరళ తీరంలో అదుపులోకి తీసుకుంది. ఈ విషయం ఇరు దేశాల మధ్య దౌత్య పరమైన వివాదానికి కూడా దారితీసింది. సిబ్బందిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. అయితే, కేసు విచారణలో ఉండగానే, నౌక యాజమాన్యం రంగంలోకి దిగింది.

ఒక్కొక్క మృతుని కుటుంబానికి రూ. కోటి ముట్టచెప్పి రాజీకి రావాలని, కోర్టులో తమకు వ్యతిరేకంగా ప్రవర్తించరాదంటూ ఒప్పందం చేసుకుందని వార్తలు వచ్చాయి. దీన్ని న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. న్యాయస్థానం వెలుపల జరిగే ఈ తరహా చర్యలను తాము ఎంతమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. ఇంత జరుగుతున్నా కేరళ ప్రభుత్వం ఏమి చేస్తుందని నిలదీసింది. న్యాయమూర్తులు ఆర్.ఎం.లోధా, హెచ్.ఎల్.గోఖలేతో కూడిన సుప్రీం ధర్మాసనం దీన్ని భారత న్యాయవ్యవస్థకు సవాలుగా పేర్కొంది.

మృతుల కుటుంబాలకు ఇటలీ కంపెనీకి జరిగిన ఒప్పందాన్ని ఎందుకు వ్యతిరేకించలేదని ధర్మాసనం అడిగింది. భారత్‌లోనే కాదు.. ఏ దేశంలో అయినా ఆయా దేశాల పౌరులకు జీవించే హక్కు ఉంటుందని, దాన్ని ఎవరూ కాలరాయలేరని వ్యాఖ్యానించింది. అమాయకుల ప్రాణాలను బలిగొన్న తర్వాత డబ్బు ముట్టచెప్పి మ్యాటర్ సెటిల్ చేసుకోవడం అంటే ప్రాణాలకు డబ్బుతో విలువ కట్టడమేనంది.

రాజ్యాంగంలోని 21వ అథికరణం పౌరులందరికీ స్వేచ్చను, జీవించే హక్కును ప్రసాదిస్తోందని దాన్ని పరిహరించజాలమని స్పష్టం చేసింది. ఇంతకు ముందు ఈ నెల 23వ తేదీన జరిగిన విచారణలో..జాలర్లను చంపిన గార్డులపై క్రిమినల్ కేసులు ఎత్తివేయాలంటూ కేరళ, కేంద్ర ప్రభుత్వాలతో పాటు ఇటలీ కంపెనీ చేసిన విన్నపాన్ని కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి