నదీ జలాల సమస్య పరిష్కారానికి కేంద్రం జోక్యం: కరుణ

శనివారం, 20 ఫిబ్రవరి 2010 (18:23 IST)
దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య నెలకొన్న ప్రధాన నదీ జలాల సమస్యల పరిష్కారంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి విజ్ఞప్తి చేశారు. అపుడే అన్ని రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొంటుందన్నారు.

డీఎంకే కార్యవర్గ, సర్వసభ్య సమావేశం శనివారం ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కావేరితో పాటు ఇతర నదీ జలాల వ్యవహారంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను కేంద్రం ఆహ్వానించి చర్చలు జరపాలని విజ్ఞప్తి చేశారు.

దీనిద్వారా రాష్ట్రాల మధ్య ఉన్న జలవివాద సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ముల్లై పెరియార్ రిజర్వాయర్‌ను ఇప్పటి వరకు మూడు సార్లు ఇంజనీర్లు తనిఖీ చేశారన్నారు. ఈ తనిఖీల్లో డ్యాం నిర్మాణం పటిష్టంగా ఉన్నట్టు తేల్చారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ డ్యాంను తనిఖీ చేయాలని వస్తున్న వాదనల్లో అర్థం లేదన్నారు.

అందుకే సుప్రీంకోర్టు జస్టీస్ ఏఎస్.ఆనంద్ నేతృత్వంలో నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీలో తమిళనాడు ప్రభుత్వం తరపున ప్రతినిధిని నియమించబోమని ఆయన చెప్పారు. ఈ మేరకు తమ పార్టీ జనరల్ బాడీ సమావేశంలో తీర్మానం చేసినట్టు ఆయన తెలిపారు.

వెబ్దునియా పై చదవండి