నరేంద్ర మోడీకే నా ఓటన్న కిరణ్ బేడీ: కేజ్రీవాల్‌కు దూరమెందుకు?

శుక్రవారం, 10 జనవరి 2014 (18:16 IST)
FILE
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఆయన మాజీ మద్దతుదారు కిరణ్ బేడీ దూరమయ్యారు. ఆమె కేజ్రీవాల్‌ను కాకుండా బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని బలపరుస్తూ ముందుకు వచ్చారు. ప్రధానిగా నరేంద్ర మోడీకే ఆమె ఓటేస్తున్నారు.

కేజ్రీవాల్‌కు రాజకీయాల్లో అంత అనుభవం లేకపోవడంతోనే దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కిరణ్ బేడీ మోడీకి మద్దతు ప్రకటించినట్లు బేడీ సన్నిహిత వర్గాల సమాచారం.

ఇంకా కిరణ్ బేడీ ట్విట్టర్లో... తనకు ప్రథమ ప్రాధాన్యం భారత్ అని, మంచి పాలన, మంచి యంత్రాంగం, నిజాయితీ, భాగస్వామ్య విధానం కారణంగా ఓ స్వతంత్ర ఓటరుగా తాను నరేంద్ర మోడీకి ఓటేస్తానని అని రాశారు. అన్నా హజారే, కేజ్రీవాల్ అవినీతి వ్యతిరేక పోరాటంలో పాలు పంచుకున్న కిరణ్ బేడీ ఇప్పుడు మోడీకి మద్దతు తెలపడం గమనార్హం.

కుంభకోణాలను అంతం పలకాలని భావించే ఎవరు కూడా మరోసారి కాంగ్రెసు పార్టీకి ఓటేయరని, అరవింద్ కేజ్రీవాల్‌ను, ఆయన జట్టును దేవుడు రక్షించాలని ఆమె అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయాల్లో విలువలను మార్చిందని, ఇది దేశానికంతటికీ మంచిదని కిరణ్ బేడీ అన్నారు.

వెబ్దునియా పై చదవండి