నళిని విడుదలపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి: కరుణ

గురువారం, 4 ఫిబ్రవరి 2010 (09:55 IST)
File
FILE
దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసులో జీవిత కారాగారశిక్షను అనుభవిస్తున్న ఎల్టీటీఈ సభ్యురాలు నళిని విడుదల చేసే అంశంలో కేంద్రమే తగు నిర్ణయం తీసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి స్పష్టం చేశారు. ఈ అంశంలో కేంద్రాన్ని సంప్రదించకుండా తాము ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని ఆయన తేల్చి చెప్పారు.

దీనిపై ఆయన బుధవారం చెన్నయ్‌లో మాట్లాడుతూ.. ఆమె విడుదలపై తన నిర్ణయాన్ని చెప్పడానికి కూడా ఆయన నిరాకరించారు. ఇటువంటి క్లిష్ట సమస్యలపై కేంద్ర స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాల్సిందేకాని, రాష్ట్ర ప్రభుత్వం తనకు తానుగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. గడువుకంటే ముందుగా విడుదల చేయాలని నళిని దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.

దీనిపై మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు, వెల్లూరు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఒక సలహా మండలిని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, కరుణానిధి వివరించారు. కమిటి నివేదిక మంగళవారమే తమకు అందిందని చెబుతూ, దీనిపై నిర్ణయం కేంద్రం స్థాయిలో తీసుకోవాల్సి ఉందన్నారు. నిజానికి రాజీవ్ గాంధీ హత్య కేసులో నళినికి కోర్టు మరణశిక్ష విధించింది. దాన్ని తర్వాత యావజ్జీవ శిక్షగా మార్చారు.

1991 జూన్‌లో అరెస్టయి నళిని.. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే.. 19 సంవత్సరాలు జైలు జీవితం గడిపారు. ఈ మధ్య కాలంలో తన సత్‌ప్రవర్తనను దృష్టిలో ఉంచుకుని తనను విడుదల చేయాలని నళిని కోరుతోంది. అయితే, దీనిని జనతా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ సుబ్రమణ్యం స్వామితో పాటు.. తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ నేతలు సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి