పార్లమెంట్ ముందుకు వచ్చిన "అణు" పరిహార బిల్లు

శనివారం, 8 మే 2010 (09:22 IST)
కేంద్రంలోని యూపీఏ సంకీర్ణ సర్కారు ఎట్టకేలకు వివాదాస్పద అణు ప్రమాద పరిహార బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. శుక్రవారంతో ముగిసిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును కేంద్ర మంత్రి పృథ్విరాజ్ చౌహాన్ ప్రతిపక్ష సభ్యుల తీవ్ర నిరసనల మధ్య ప్రవేశపెట్టారు. ఈ బిల్లు రాజ్యాంగంలోని వివిధ అధికరణాలకు వ్యతిరేకమని, ఇది చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత యశ్వంత్‌ సిన్హా ఆరోపించారు.

అమెరికా చేస్తున్న ఒత్తిడి కారణంగానే ఈ బిల్లును కేంద్రం బలవంతంగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిందన్నారు. ఈ బిల్లు అర్హతలు, అధికారాలను మరో సీనియర్‌ భాజపా సభ్యుడు మురళీమనోహర్‌ జోషీ ప్రశ్నించారు. ఈ బిల్లు తాము వ్యతిరేకిస్తున్నట్టు వామపక్ష సభ్యులు ప్రకటించి సభ నుంచి వాకౌట్ చేశారు.

కాగా, 2008 సంవత్సరంలో భారత్‌-అమెరికాల మధ్య కుదిరిన 123 అణు ప్రమాద పరిహార ఒప్పందం అమలులో ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం తుదిచర్య కావడంతో దీనికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. ఈ బిల్లు ఆమోదానికి నోచుకుంటేనే.. భారత్-అమెరికా పౌర అణు సహకార ఒప్పందం అమలుకు నోచుకుంటుంది. అణు విద్యుత్‌ కేంద్రాలలో ప్రమాదం ఏర్పడితే అత్యధికంగా రూ.500 కోట్ల పరిహారం చెల్లించాలని ఈ బిల్లు నిర్దేశిస్తున్నది. దీన్ని ప్రతిపక్ష సభ్యులు వ్యతిరేకిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి