ప్రైవేటు ఆస్పత్రులకు స్వైన్ ఫ్లూపై కొత్త విధానాలు: కేంద్రం

మంగళవారం, 4 ఆగస్టు 2009 (13:17 IST)
File
FILE
దేశంలో తొలి స్వైన్ ఫ్లూ మరణం నమోదు కావడంతో కేంద్ర ఆరోగ్యం శాఖ మేల్కొంది. ప్రైవేటు ఆస్పత్రులకు కొత్త విధి విధానాలను అమలు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా, ఈ ప్రపంచ మహమ్మారిని మరింత సమర్థవంతంగా ఎదుర్కొని, నివారించేందుకు కొత్త విధానం రూపొందిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.

పూణెలో ఈ వ్యాధితో మరణించిన 14 ఏళ్ల బాలికకు సరైన సమయంలో వైద్యం చేసి ఉంటే బతికేదని వైద్యులు చెప్పారు. అంతేకాని స్వైన్ ఫ్లూ పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాలిక మరణించిందని అధికారులు ధృవీకరించారు.

దేశంలో తొలి స్వైన్ ఫ్లూ మృతి కేసు నమోదు కావడంతో ప్రజల్లో మాత్రం భయాందోళనలు నెలకొన్నాయి. వీటిని నివృత్తి చేసేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులామ్‌నబీ ఆజాద్‌ నడుం బిగించారు. స్వైన్ ఫ్లూను ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోందని, మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమౌతోందని ఆయన వెల్లడించారు.

పూణెలో మృతి చెందిన చిన్నారికి వైద్యం చాలా ఆలస్యంగా అందించారని అందువల్లే మరణించినట్టు గులాం వివరించారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం ఉన్నతస్థాయి సమావేశం సమీక్ష జరిపి కొత్త విధానాలను ప్రకటిస్తామని తెలిపారు.

కాగా, మంత్రి గులాం నబీ ఆజాద్‌ నేతృత్వంలో జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశానికి ఆరోగ్య శాఖ కార్యదర్శి నరేష్ దయాల్, హెల్త్ రీసెర్చ్ విభాగం కార్యదర్శి వీఎన్.కటోచ్, డీజీహెచ్‌ఎస్.ఆర్కే.శ్రీవాస్తవ తదితరులు పాల్గొంటారని ఆరోగ్య వర్గాలు వెల్లడించారు.

స్వైన్ ప్లూ రోగలక్షణాలు కనిపించే వారిని తక్షణం ఆస్పత్రుల్లో చేర్చి, ఐసీయు వార్డుల్లో ఉంచాలని మంత్రి కోరారు. అంతేకాకుండా, కొత్త విధివిధానాల రూపకల్పనకు వైద్యులు, నిపుణులతో మాట్లాడి, రూపొందించనున్నట్టు ఆజాద్ చెప్పారు.

సోమవారం దేశంలో మరో ఏడు స్వైన్ ఫ్లూ కేసులు వెలుగుచూశాయి. వీటితో కలుపుకుని మొత్తం స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య 558కు చేరుకుంది. వీటిలో 470 మంది రోగులకు వైద్య చికిత్సలు చేసి కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేశారు. అలాగే, ఇప్పటి వరకు మొత్తం 2479 మందికి స్వైన్ ఫ్లూ పరీక్షలు చేశారు.

వెబ్దునియా పై చదవండి