భన్వరిదేవిని చంపేశారు : హైకోర్టుకు తెలిపిన సీబీఐ

మంగళవారం, 10 జనవరి 2012 (17:22 IST)
రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టిన నర్సు భన్వరిదేవి హత్య కేసులో సీబీఐ ఆ రాష్ట్ర హైకోర్టులో నివేదికను సమర్పించింది. ఇందులో భన్వరిదేవిని హత్య చేసినట్టు పేర్కొంది. ఈ హత్యతో కొందరు రాజకీయ నాయకులకు సంబంధం ఉన్నట్లు తన నివేదికలో పేర్కొంది.
సీబీఐ మొదటిసారి అధికారికంగా తన నివేదికలో నర్సు భన్వరిదేవి తప్పిపోయిన నాలుగు నెలల తర్వాత హత్యకు గురైనట్టు ధృవీకరిస్తూ నివేదికను కోర్టుకు సమర్పించడం గమనార్హం.

భన్వరిదేవి మృతదేహానికి సంబంధించి ఎముకలు, ఆమె ధరించిన చేతి గడియారం, చెవి పోగులను 25 అడుగుల లోతైన కాలువలో ఇటీవల కనుగొన్న విషయం తెల్సిందే. ఈ వస్తువులను భన్వరిదేవి తనయుడు సాహిల్ కూడా గుర్తించాడు.

సేకరించిన వస్తువులను మూడు రోజుల పాటు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీలో నిశితంగా పరిశీలించిన తర్వాత భన్వరిదేవికి చెందినవిగా నిర్ధారించారు. అలాగే, రెండు తుపాకీలు, గోనె సంచి, బ్యాట్, కొన్ని ఎముకల శకలాలు, మొబైల్ ఫోన్, చెవిరింగులు, వాచ్ మరియు బ్రాస్లెట్‌ను ఆ ప్రాంతంలో కనుగొన్నారు.

వెబ్దునియా పై చదవండి