ముందస్తు బెయిల్ నేరానికి పాస్‌పోర్టు కాదు: సుప్రీం

శుక్రవారం, 10 అక్టోబరు 2008 (19:27 IST)
FileFILE
నేరారోపణకు గురైన వారికి కోర్టులు ముందస్తు బెయిల్ ఇచ్చి చట్టపరమైన రక్షణ కల్పించరాదని సుప్రీం కోర్టు ఆదేశించింది. నేరస్తులు తమ కార్యకలాపాలు కొనసాగించేందుకు ముందస్తు బెయిల్ వారికి ఒక పాస్‌పోర్టులా తయారు కాకూడదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

బెయిల్ కల్పిస్తూ ముందుగానే రక్షణ ఇవ్వడం అనేది నేర చర్యలను కొనసాగించేందుకు పాస్‌పోర్ట్‌లా లేదా నేరానికి ఆహ్వానంలా లేదా అన్ని రకాల చట్ట విరుద్ధ చర్యలకు రక్షణ కవచంలా ఉండరాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అలాంటి అవకాశాలకు ఎన్నటికీ ఇకపై కోర్టులు వీలు కల్పించరాదని ఢిల్లీలోని అపెక్స్ కోర్టు ఆదేశించింది.

సుంకాల ఎగవేతకు పాల్పడిన పాదం నరేన్ అగర్వాల్ అనే ఎగుమతిదారుకు పది రోజుల నోటీసు ఇచ్చిన తర్వాతే అతడిని అరెస్టు చేయవలసి ఉంటుందని రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌కు అనుకూలంగా సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

ఈ సందర్భంగా రాజస్తాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పు చట్ట విరుద్ధమని, తప్పుల తడక అని కేంద్ర ప్రభుత్వం చేసిన వాదనను సుప్రీం సమర్థించింది. ముందస్తు బెయిల్ అనేది నేరాలకు పాస్‌పోర్ట్ కారాదని హితవు చెప్పింది.

వెబ్దునియా పై చదవండి