మృత్యువుకు వెరవని భక్తి : నయనాదేవి ఆలయంలో రద్దీ

మంగళవారం, 5 ఆగస్టు 2008 (14:23 IST)
తొక్కిసలాట సందర్భంగా ఆదివారం 146 మంది మృతిచెందిన సంఘటన నయనాదేవిని దర్శించేందుకు వచ్చే భక్తులపై ఏమాత్రం ప్రభావం చూపలేదు. మృత్యుఘోష అనంతరం సోమవారం నయనాదేవి ఆలయంలో సోమవారం మరోసారి భక్తుల రద్దీ ఎక్కువగా కన్పించింది.

హిమాచల్ ప్రదేశ్‌లో కొలువైన నయనాదేవిని దర్శించేందుకు ఆదివారం వేలమంది భక్తులు ఆలయం వద్దకు చేరుకోగా అకస్మాత్తుగా తలెత్తిన తొక్కిసలాటతో 146మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎక్కువగా మహిళలు, పిల్లలు, వృద్ధులే ఉండడం పలువురిని తీవ్రంగా కలిచివేసింది.

అయితే ఈ ఘటన జరిగిన మరుసటిరోజే నయనాదేవిని దర్శించుకునేందుకు భక్తులు వెల్లువలా తరలివచ్చారు. సోమవారం దాదాపు 30వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఉంటారని ఆలయ అధికారులు పేర్కొన్నారు. తొక్కిసలాట సందర్భంగా అనేకమంది మృత్యువాత పడ్డ సంఘటనను దృష్టిలో ఉంచుకొని సోమవారం భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

ఇందులో భాగంగా హోంగార్డులనే కాక ఐటీబీపీ సిబ్బందిని, పోలీసులను దేవాలయంలో భద్రతా చర్యలు చేపట్టేందుకు నియమించారు. అలాగే రానున్న రోజుల్లో నయనాదేవి ఆలయంలో ఎలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఓ ప్రత్యేక విధానాన్ని చేపట్టనున్నట్టు హిమాచల్ ప్రభుత్వం పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి