వైఎస్‌ను బలిగొన్న ప్రమాదంపై దర్యాప్తుకు కమిటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాణాలను బలితీసుకున్న హెలికాఫ్టర్ ప్రమాదంపై దర్యాప్తు జరిపేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో వైఎస్సార్ మృతి చెందిన సంగతి తెలిసిందే.

వైఎస్సార్‌తోపాటు ఈ ప్రమాదంలో నలుగురు అధికారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు పౌర విమానయాన శాఖ గురువారం రాత్రి నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. రెండు నెలల్లోగా ఈ ఘోర ప్రమాదంపై దర్యాప్తు జరిపి కమిటీ కేంద్రానికి నివేదిక సమర్పించనుంది.

పవన్ హాన్స్ హెలికాఫ్టర్స్ మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ ఆర్‌కే త్యాగి ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారని పౌర విమానయాన శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కమిటీ భారత వైమానిక దళంలోని నిపుణుల సాయాన్ని కూడా తీసుకోనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన బెల్ 430 హెలికాఫ్టర్‌లో ప్రయాణిస్తూ వైఎస్సార్ మృతి చెందారు.

ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా శంషాబాద్ విమానాశ్రయంతో సంబంధాలు కోల్పోయిన ఈ హెలికాఫ్టర్ నల్లమల అడవుల్లో ఓ కొండను ఢీకొని కూలిపోయింది. హైదరాబాద్ నుంచి వైఎస్సార్ రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు చిత్తూరు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో వైఎస్సార్‌తోపాటు, విమానంలోని మిగిలిన నలుగురు అధికారులు ప్రాణాలు కోల్పోయారు.

వెబ్దునియా పై చదవండి