సాధిక్ బాషా మృతితో తమకెలాంటి లింకులేదు: డీఎంకే

కేంద్ర టెలికామ్ మాజీ మంత్రి ఏ.రాజా సన్నిహితుడు సాధిక్ బాషా మృతికీ తమకు ఎలాంటి సంబంధం లేదని డీఎంకే తేల్చి చెప్పింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. 2జీ స్పెక్ట్రమ్‌ కేసులో కీలక వ్యక్తిగా సీబీఐ అనుమానిస్తున్న బాషా మార్చి 16వ తేదీన అనుమానాస్పద స్థితిలో తన ఇంటిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే.

ఈ కుంభకోణంలో ఇప్పటికే అరెస్టు అయి తీహార్ జైలులో ఉన్న ఏ.రాజాకు అత్యంత సన్నిహితుడుగా చెలామణి అయిన సాధిక్ భాషా.. మృతిపై పలు అనుమానాలు తలెత్తడంతో సుప్రీంకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది.

సాధిక్ బాషాది ఆత్మహత్య కాదని, హత్యేనని సీబీఐ తన విచారణలో తేలినట్టు గత రెండు రోజులుగా వార్తలొచ్చాయి. 2జీ స్పెక్ట్రమ్‌ కేసులో అప్రూవర్‌గా మారేందుకు బాషా నిర్ణయించుకున్నాడని, ఆ క్రమంలోనే అతని మరణం చోటుచేసుకుందని సీబీఐ అధికారి ఒకరు పేర్కొన్నట్లు సమాచారం.

ఈ కేసులో డీఎంకే నేతల పెద్దల హస్తం ఉన్నట్టు ఊహాగానాలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో బాషా మరణానికీ, తమకూ ఎటువంటి సంబంధం లేదని, దీనిపై ఎటువంటి న్యాయ విచారణకైనా సిద్ధమంటూ డీఎంకే ప్రకటించింది.

వెబ్దునియా పై చదవండి