హిందుత్వపై పునరాలోచన లేదు: రాజ్‌నాథ్ సింగ్

శనివారం, 1 ఆగస్టు 2009 (19:15 IST)
File
FILE
హిందుత్వ అజెండాపై పునరాలోచన చేసే ప్రసక్తే లేదని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. తమ పార్టీ మూల సిద్ధాంతాలైన హిందుత్వ, జాతీయ సాంస్కృతికతత్వంలపై మడమతిప్పబోమని ఆయన శనివారం బెంగుళూరులో తేల్చి చెప్పారు.

ఆ పార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో పాల్గొనేందుకు బెంగుళూరుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముగిసిన ఎన్నికల్లో తమ పార్టీ ఓటమిపాలు కావడం వల్ల హిందుత్వ అజెండాను త్యజించాలని పలువురు సూచిస్తున్నారు. ఈ అంశంపై పునరాలోచన చేసే అవకాశం లేదన్నారు. ముఖ్యంగా, పార్టీ కొత్త సిద్ధాంతాలు, భావజాలంపై దృష్టి సారించాలని కొందరు వ్యాఖ్యానించడం ఆశ్చర్యానికిలోను చేస్తోందన్నారు.

ఎన్నికల్లో గెలుపోటములు సహజం. అంతమాత్రానా.. తమ మార్గం నుంచి తప్పుకునే ప్రసక్తే లేదన్నారు. హిందుత్వ, జాతీయ సంస్కృతికతత్వం అజెండాలపై రాజీపడే ప్రసక్తే లేదన్నారు. అంతేకాకుండా, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడానికి తమ పార్టీ తీవ్ర వ్యతిరేకమన్నారు.

తమ పార్టీ ఓటమిపై ఆయన వామపక్షాలను ఉదహరించారు. గత ఎన్నికల ఫలితాల అనంతరం వామపక్షాల బలం 62 నుంచి 17కు పడిపోయింది. అంతమాత్రానా వామపక్షాలు వారి సిద్ధాంతాలపై పునరాలోచన చేస్తున్నారా అని ప్రశ్నించారు.

వెబ్దునియా పై చదవండి