2002 గోద్రా అల్లర్లు: మోడీ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు

బుధవారం, 8 ఫిబ్రవరి 2012 (16:44 IST)
FILE
2002 నాటి అల్లర్లలో మోడీ సర్కారు తీరును గుజరాత్ హైకోర్టు తప్పుపట్టింది. గోద్రా ఘటనానంతర అల్లర్లను నియంత్రించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యపూరిత ధోరణితో మిన్నకుండి పోయిందని వ్యాఖ్యానించింది. ఇది పెద్దసంఖ్యలో మతపరమయిన కట్టడాల విధ్వంసానికి దారితీసిందని చెప్పింది. ప్రధాన న్యాయమూర్తి భాస్కర్ భట్టాచార్య, జస్టిస్ జేబీ పర్దీవాలాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.

అల్లర్ల కారణంగా రాష్ట్రంలో ధ్వంసమయిన 500 మతపరమయిన కట్టడాలకు నష్టపరిహారం ఇవ్వాలని ధర్మాసనం తీర్పు చెప్పింది. గుజరాత్ ఇస్లామిక్ రిలీఫ్ కమిటీ (ఐఆర్సిజీ) దాఖలు చేసిన ఈ పిటీషన్‌ను విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ప్రభుత్వపరమయిన పలు తప్పిదాలను గమనించారు. ఈ ఉదాశీన వైఖరే అల్లర్ల నాటి సమస్యలన్నింటికీ మూలకారణమయిందనే నిర్ణయానికి వచ్చారు.

విధ్వంసానికి గురయిన ఆయా కట్టడాలకు మరమ్మతులు చేసి నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని వారు స్పష్టం చేశారు. "ప్రభుత్వం గృహ, వాణిజ్య కట్టడాల విధ్వంసాలకు నష్టపరిహారం ఇస్తున్నపుడు మతపరమయిన కట్టడాలకు కూడా ఇవ్వాల్సిందే," అని న్యాయస్థానం కుండబద్ధలు కొట్టింది.

రాష్ట్రంలోని 26 జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు ఆయా ప్రాంతాల్లో విధ్వంసానికి గురయిన మతపరమయిన కట్టడాలకు నష్టపరిహారం కోరుతూ దాఖలయ్యే దరఖాస్తులను స్వీకరించి తగు నిర్ణయం తీసుకోవాలని కూడా న్యాయస్థానం సూచించింది. ఆయా జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు ఆయా ప్రాంతాల్లోని కట్టడాల నష్టపరిహారంపై తమ నిర్ణయాలను కూడా ఆరు నెలల్లోగా హైకోర్టుకు పంపాలని చెప్పింది.

వెబ్దునియా పై చదవండి