కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారతో జోడో యాత్ర తొమ్మిది రోజుల విరామం తర్వాత మళ్లీ మంగళవారం నుంచి ప్రారంభంకానుంది. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రారంభించనున్నారు. గత యేడాది సెప్టెంబరు 7వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన ఈ యత్ర ఇప్పటివరకు 110 రోజుల్లో మూడు వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.
తమిళనాడు, కేరళ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల మీదుగా సాగిన ఈ యాత్ర మంగళవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రారంభంకానుంది. ఈ యాత్రం అంతిమంగా జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ముగుస్తుంది. ఒక రాజకీయ నేత ఇన్ని వేల కిలోమీటర్లు, ఇంత సుధీర్ఘంగా యాత్ర చేపట్టడం దేశ రాజకీయ చరిత్రలో ఇదే తొలిసారని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.
కాగా, ఈ నెల 26వ తేదీన శ్రీనగర్‌లో ఈ యాత్ర ముగుస్తుంది. ఆ తర్వాత "హాథ్ సే హాథ్ జోడో" (చేయి చేయి కలుపు) అంటూ ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించనుంది. ఈ యాత్రకు సంబంధించిన సందేశాన్ని వ్యాప్తి చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. "హాథ్ సే హాథ్ జోడో" ప్రచార బాధ్యతలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ చేపట్టనున్నారు. దేశంలోని మహిళలో లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రియాంకా గాంధీ ప్రారంభిస్తారు.