శ్రీనగర్‌లో ఘోరం.. లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. 36 మంది మృతి

బుధవారం, 15 నవంబరు 2023 (15:58 IST)
జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలో పెను విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. కిష్త్వాఢ్‌ నుంచి జమ్మూ వెళ్తున్న ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 36 మంది మృతి చెందారు. మరో 19మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. జమ్మూలోని డోడా జిల్లాలో బటోత్‌-కిష్త్వాఢ్‌ జాతీయ రహదారిపై ఈ ఘోరం చోటుచేసుకుంది.
 
దాదాపు 60మందికి పైగా ప్రయాణికులతో బుధవారం ఉదయం కిష్త్వాఢ్‌ నుంచి బస్సు బయలుదేరింది. ఈ క్రమంలో తృంగాల్‌ - అస్సార్‌ ప్రాంతానికి చేరుకోగానే దాదాపు 300 అడుగుల లోయలో బస్సు జారిపడింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అక్కడి పరిస్థితులను ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
 
మరోవైపు, ఈ ప్రమాదం వార్త తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతులకు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు