దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ప్రభుత్వ పిల్లల ఆశ్రమంలో కరోనా కలకలం రేపింది. ఏకంగా 57 మంది మైనర్ పిల్లలకు కరోనా సోకింది. అందులో ఐదు మంది బాలికలు గర్భిణీలు, ఒక హెచ్‌ఐవీ పాజిటివ్ బాలిక ఉన్నారు. దీంతో ఉత్తరప్రదేశ్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆశ్రమాన్ని సీల్ చేసి సిబ్బందిని క్వారంటైన్ చేశారు.
దీనిపై కాన్పూర్ జిల్లా మెజిస్ట్రేట్ బ్రహ్మ డియో రామ్ తివారీ మాట్లాడుతూ.. ''ఆశ్రమంలో ఏడు మంది గర్భిణి మహిళలు ఉన్నారు. అందులో ఐదుగురికి కరోనా సోకింది'' అని ధ్రువీకరించారు. ఇక కరోనా సోకిన అందరికీ కాన్పూర్ మెడికల్ కాలేజీలో చికిత్స జరుగుతున్నట్లు కాన్పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దినేష్ కుమార్ వెల్లడించారు.
ఆశ్రమంలో కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందిందన్న దానిపై దర్యాప్తు చేస్తామని దినేష్ కుమార్ వెల్లడించారు. ఇదిలా ఉంటే బాలికల ఆశ్రమంలో గర్భిణిలు ఉండటంపై స్థానికంగా పలు వార్తలు రాగా.. దినేష్ కుమార్ వాటిని ఖండించారు. ఆశ్రమంలోకి రాకముందే వారు గర్భం దాల్చారని, దానికి సంబంధించిన దర్యాప్తు కూడా జరుగుతోందని దినేష్ కుమార్ వివరించారు.