కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా, కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల మేరకు.. కంటైన్మెంట్ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలకు అనుమతినిచ్చింది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా, థియేటర్లలో ఇప్పటివరకు 50 శాతం సీటింగ్‌కే అనుమతి ఉన్నదని, ఇకపై సీటింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని కేంద్రం పేర్కొన్నది.
తాజా మార్గదర్శకాల ప్రకారం స్విమ్మింగ్ పూల్స్ ఉపయోగించడంపై ఎలాంటి నిబంధనలు ఉండవు. రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాలపై ఆంక్షలను పూర్తిగా తొలిగించారు. సామాజిక, మతపరమైన కార్యక్రమాల్లో, క్రీడలు, విద్యాసంస్థల్లో ఇప్పటివరకు ఉన్న నిబంధనల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త మార్గదర్శకాలను జారీచేయవచ్చని సూచించింది.
అదేసమయంలో అంతర్జాతీయ విమానాల రాకపోకలపై ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని వచ్చే నెల 28 వరకు పొడిగిస్తున్నట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటించింది. అయితే, డీజీసీఏ అనుమతి పొందిన అంతర్జాతీయ కార్గో, ప్రత్యేక విమానాలకు ఈ నిషేధం వర్తించదని తెలిపింది.