వెంకీ సినిమా మల్లీశ్వరి చిత్రంలో డైలాగ్ పెళ్లికాని ప్రసాద్‌లు ఇటీవలి కాలంలో ఎక్కువవుతున్నారు. కారణాలు ఏమయినప్పటికీ పెళ్లి చేసుకునేందుకు అబ్బాయిలు క్యూలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. దీనితో ఇప్పుడు అబ్బాయిలు పూర్తి ఫ్రస్టేషన్లో వుండిపోతున్నారు. తాజాగా చత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ యువకుడు తనకు పెళ్లి కాలేదని పక్కింటి అమ్మాయిని హత్య చేసిన ఘటన దారుణం వెలుగుచూసింది.
పోలీసులు వెల్లడించిన వివరాలను చూస్తే... పింటు అనే వ్యక్తి రాయ్‌పూర్‌లో వుంటున్నాడు. ఇతడు పెళ్లి చేసుకునేందుకు గత కొన్నేళ్లుగా అదేపనిగా కాలికి బలపం కట్టుకుని మరీ తిరుగుతున్నాడు. ఈ క్రమంలో 12 మంది అమ్మాయిలను పెళ్లిచూపులు చూశాడు. విశేషమేమిటంటే... ఆ పెళ్లి చూపులు ముగిశాక అమ్మాయిలు అతడు తమకు నచ్చలేదని చెప్పేస్తున్నారు.
దీనితో అతడికి పక్కింటి అమ్మాయి పైన అనుమానం వచ్చింది. తనకు పెళ్లి కాకుండా అయ్యేందుకు ఆమే కారణమని అనుమానించిన అతడు ఆమెను హత్య చేశాడు. ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని లోపలికెళ్లి ఆమె చున్నీతోనే మెడను బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఆమెను హత్య చేసి పారిపోవాలని చూస్తుండగా స్థానికులు గమనించి పోలీసులకు పట్టించారు.