టీసీఎస్ ఇంజనీరు.. ప్రోగ్రాములు రాసుకోవడం మాని అమ్మాయిని వేధించాడు.. అడ్డంగా బుక్కయ్యాడు.

శుక్రవారం, 12 మే 2017 (04:40 IST)
వాడు దేశంలోనే ప్రముఖ సాప్ట్ వేర్ కంపెనీ టీసీఎస్‌లో ఉద్యోగి. ఆఫీసులో ప్రోగ్రాములు రాసిరాసీ అలసిపోయాడేమో మరి. అదేదో సినిమాలో చెప్పినట్లు సరదాగా అమ్మాయిని వేధించడం మొదలెట్టాడు. తలవంచుకుని పోయేదే అయితే అమ్మాయిలను వేధిస్తుండటం అనే కొత్త ప్రోగ్రామ్ రైటింగ్‌లో నిష్ణాతుడైపోయేవాడు. కానీ ఆ అమ్మాయి ఇలాంటి వాళ్లకు ఎలాంటి ప్రోగ్రాంలు రాస్తే తిక్క కుదురుతుందో రెండాకులు ఎక్కువే చదివినట్లుంది. వెంటనే స్మార్ట్ పోన్ తీసి యాప్‌తో కొట్టింది. దాంతో పోలీసులు వెంటాడిమరీ అతగాడిని పట్టుకున్నారు. రాత్రి వేళల్లో పని ముగించుకుని ఇళ్లకు వెళ్లే అమ్మాయిలకు ఆపద్బాంధవిలాంటిది యాప్.. మీ లక్ బాగుంటే క్షణాల్లో సహాయం లభిస్తుంది మరి.
 
విషయానికి వస్తే... బెంగళూరులో బుధవారం రాత్రి 11గంటలకు డ్యూటీ ముగించుకున్న ఓ యువతి ఇట్లూరు రింగ్‌ రోడ్‌ వద్ద బస్సు ఎక్కింది. ముందు సీటులో కూర్చున్న ఓ యువకుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే ఆమె యాప్‌లో బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నగరంలో మహిళల రక్షణ కోసం ఏర్పాటైన ‘పింక్‌ హొయసళ’ గస్తీ సిబ్బంది తక్షణం రంగంలోకి దిగి, ఆ బస్సును గుర్తించి, వెంబడించి, ఆపి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, అతడు టీసీఎస్ లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నట్లు గుర్తించారు.
 
ఒకరి జీవితాల్లో వేలుపెట్టే ప్రోగ్రాములు రాసే సాహసం ప్రదర్శిస్తే అవతలి నుంచి మన జీవితాలను బొక్కలో వేసే ప్రోగ్రాములు కూడా రాసే వారుంటారని అర్థం చేసుకుంటే సరి. ఒక పని చేస్తున్నప్పుడు కాస్తంత ఇంగితజ్ఞానం ఉపయోగించాలనే ప్రోగ్రామ్‌ను ఆ ఘనమైన టీసీఎస్ కంపెనీ వాళ్లు తమ ఉద్యోగులకు నేర్పడం లేదేమో మరి.
 

వెబ్దునియా పై చదవండి