అమ్మ బతికుంటే ఇదంతా జరిగేనా? శశికళకే నా సపోర్ట్.. విజయశాంతి

శనివారం, 11 ఫిబ్రవరి 2017 (17:46 IST)
తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్న నేపథ్యంలో.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ- ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వంల మధ్య వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు పన్నీరు సెల్వంకు ఎమ్మెల్యేల మద్దతు పెరుగుతుండటంతో.. తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు ఏ నిమిషాన మాట మారుస్తారో అని వారిని కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు శశికళ. 
 
తాజాగా చిన్నమ్మ శశికళ గురించి టాలీవుడ్ హీరోయిన్, కాంగ్రెస్ నేత విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ.. తమిళనాడులో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలు నన్ను తీవ్రంగా బాధిస్తున్నాయన్నారు. జయలలిత బ్రతికుంటే అసలు ఈ పరిస్థితులొచ్చేవి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నాడీఎంకేలో ఏర్పడ్డ ఈ సంక్షోభం త్వరగా సమసిపోయి పరిస్థితులు చక్కపడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. 
 
పన్నీర్ సెల్వంకు తన మద్దతు ఉండదని.. శశికళకు మాత్రమే మద్దతిస్తానని విజయశాంతి తెలిపారు. కాగా విజయశాంతిపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం ఎటుందో తమరికి తెలియదా మేడమ్ అంటూ కన్నెర్రజేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి