అన్నాడీఎంకేలో సస్పెన్స్‌కు తెరపడింది... సీఎం అభ్యర్థిగా ఆయనే..!

బుధవారం, 7 అక్టోబరు 2020 (12:24 IST)
తమిళనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకేలో కొనసాగుతూ వచ్చిన సస్పెన్స్‌కు బుధవారం తెరపడింది. వచ్చే యేడాది మే నెలలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రస్తుత సీఎం ఎడప్పాడి కె.పళనిస్వామి పేరును ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. సీఎం అభ్యర్థి రేసులో ఉన్న ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం వెనక్కి తగ్గడంతో ఎడప్పాడి పేరును ఖరారు చేసింది. 
 
ప్రస్తుత సీఎం పళనిస్వామే, తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ సీఎం అభ్యర్థని పార్టీ ప్రకటించింది. ఆయన పేరును ఖరారు చేస్తూ, చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగిన భేటీలో కీలక నిర్ణయం తీసుకుంది. పళనిస్వామి పేరును మాజీ సీఎం పన్నీర్ సెల్వం స్వయంగా ప్రతిపాదించడంతో ఆయనకు మరెవరి నుంచీ పోటీ రాలేదు. 
 
ఇదేసమయంలో పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతను పన్నీర్‌ సెల్వంకు అప్పగిస్తూ కూడా నిర్ణయం వెలువడటం గమనార్హం. అన్నాడీఎంకేలో ఉన్న పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలు తీసుకున్న ఈ నిర్ణయంపై ఇరునేతలూ సంతకాలు చేశారు. 
 
ఆపై 11 మంది సభ్యులతో స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో పళనిస్వామి మద్దతుదారులు ఐదుగురు, పన్నీర్‌ సెల్వమ్ మద్దతుదారులు ఐదుగురు, తటస్థంగా ఉండే ఓ నేత ఉండాలని కూడా ఒప్పందానికి ఇద్దరు నేతలూ వచ్చారు. దీంతో సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై ఇప్పటివరకు నడిచిన వివాదానికి తెరపడింది.
 
కాగా, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాత పార్టీకి చెందిన ఇద్దరు ప్రధాన నేతలూ, తానే ముఖ్యమంత్రినంటే, కాదు... తానే కాబోయే ముఖ్యమంత్రి నంటూ చేసిన ప్రకటనలు గుప్పిస్తూ వచ్చారు. దీనికి బుధవారంతో తెరపడింది. ఇద్దరు నేతలూ కలిసి సంయుక్తంగా ప్రకటన వెలువరించడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు