ఫ్లోర్ టెస్టుతో శశికళ-పన్నీర్ వార్‌కు ఫుల్‌స్టాప్: వారంలోపు అసెంబ్లీ-జయ కేసుపై తీర్పు రేపే!

సోమవారం, 13 ఫిబ్రవరి 2017 (18:20 IST)
తమిళనాడులో ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి తెరపడే రోజులు దగ్గర పడుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టు తీర్పు మంగళవారం రానుంది. ఇటు సుప్రీం తీర్పు, అటు ఫ్లోర్ టెస్ట్‌లో శశికళ నెగ్గవలసి ఉంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ.. తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వంతో బల నిరూపణకు సై అంటున్నారు. తమిళనాట ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి ఫుల్ స్టాప్ పెట్టే దిశగా ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావుకు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సూచన చేశారు. 
 
ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని, ఎవరికి మెజార్టీ ఉంటే వారిని ముఖ్యమంత్రి చేయాలని సలహా ఇచ్చారు. శశికళ, పన్నీర్ సెల్వంలకు వేర్వేరుగా తీర్మానాలు ప్రవేశపెట్టాలని రోహత్గీ సూచించారు. బల నిరూపణకు వారంలోగా తమిళనాడులో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలన్నారు. సభలో ఎవరికి మెజార్టీ ఉందో తేలాలని, మేజిక్ ఫిగర్ ఎవరికి ఉంటే వారు ముఖ్యమంత్రి అని చెప్పారు.
 
అయితే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ప్రజాప్రతినిధి కాకపోవడంతో ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉండదు. శశికళ తరపు ఎమ్మెల్యేలు మాత్రం ఓటింగ్‌లో పాల్గొంటారు. ఒకే పార్టీ అన్నాడీఎంకేలో ముఖ్యమంత్రి పీఠం కోసం పోరు కొనసాగుతున్న తరుణంలో ఆపద్ధర్మ సీఎం పన్నీర్ ఓటింగ్‌కు హాజరవుతారు. 
 
గతంలో 1990లో యూపీలో ఇలాగే ఫ్లోర్ టెస్టు జరిగిందని రోహత్గీ గవర్నర్‌ విద్యాసాగర్‌కు సూచించారు. అప్పట్లో జగదాంబిక పాల్, కళ్యాణ్ సింగ్‌ల మధ్య ఫ్లోర్ట టెస్ట్ జరిగింది. నాడు ఉత్తర ప్రదేశ్‌లో ఉపయోగించిన ఫార్ములానే ఇప్పుడు తమిళనాడుకు అప్లై చేయాలని అటార్నీ జనరల్ సూచించారు.

వెబ్దునియా పై చదవండి