తమిళనాట రాజకీయాలు హీటెక్కాయి. శశికళ వర్సెస్ పన్నీర్ సెల్వం వార్ జరుగుతోంది. తమ బలాన్ని నిరూపించుకునేందుకు శశికళ-పన్నీర్ సెల్వం సిద్ధమైపోయారు. ఈ నేపథ్యంలో రాజ్‌భవన్‌లో గవర్నర్ విద్యాసాగర్‌రావుతో సమావేశం అనంతరం పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడారు. గవర్నర్‌తో తన సమావేశం దాదాపు ఏడు నిమిషాలపాటు జరిగిందని చెప్పారు.
ఇదిలా ఉంటే.. తమిళనాడు అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం తిరుగుబాటు వెనక డీఎంకే ఉందని ఆరోపణలు చేస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రతిపక్ష నేత స్టాలిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దమ్ముంటే పన్నీరు సెల్వం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని శశికళకు స్టాలిన్ తన ప్రకటనలో సవాల్ విసిరారు.
ప్రతిపక్ష నేతతో కలిసి ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం నవ్వారని, వారిద్దరికీ సంబంధాలున్నాయని శశికళ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అత్యంత వేగంగా సీఎం కాలేకపోయాననే దిగులుతో కృంగిపోయిన శశికళ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఎద్దేవా చేశారు. గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన పన్నీరు సెల్వంను పోయెస్ గార్డెన్ పిలిపించి, రెండు గంటలపాటు బెదిరించి రాజీనామా చేయించిన శశికళ.. అన్నాడీఎంకే కార్యకర్తల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. శశికళకు నిజంగా దమ్ముంటే పన్నీరు సెల్వం చేసిన విమర్శలకు, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.