గోవధపై దేశవ్యాప్తంగా వివిధ రకాలవాదనలు ఉన్నాయి. అయితే, భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో మాత్రం గోవధపై కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. అదేసమయంలో బీఫ్ మాంసంపై నిషేధం విధించాలన్న డిమాండ్లూ తెరపైకి వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీఫ్‌ను నిషేధించాలని, ముస్లింలు కూడా బీఫ్‌ను ఆరగించవద్దని చెప్పినందుకు అజ్మీర్ దర్గా మతపెద్ద జైనుల్ అబేదిన్ ఖాన్ తన పదవి పోగొట్టుకున్నారు. ఈ విషయాన్ని జైనుల్ ఖాన్ సోదరుడు అలావుద్దిన్ అలిమి బుధవారం అధికారికంగా వెల్లడించాడు. ఆయన స్థానంలో తానే బాధ్యతలు తీసుకోనున్నట్లు అలిమి ప్రకటించారు.
ఈ వివరాలను పరిశీలిస్తే... ఖ్వాజా మోయినుద్దీన్ చిస్తి 805వ వర్థంతి సందర్భంగా జైనుల్ ఖాన్ దర్గాలో మతపెద్దల సమక్షంలో ప్రసగించారు. హిందువుల ఆచారాన్ని గౌరవిస్తూ ముస్లింలు కూడా బీఫ్ తినకూడదని గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరారు. అదేసమయంలో గోసంరక్షణ కేవలం ప్రభుత్వానిదే కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని కోరారు.