స్టెరిలైట్ విస్తరణకు నిరసనగా తూత్తుకుడి రణరంగమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తమిళనాడులోని అధికార పక్షంపై విమర్శలు గుప్పిస్తున్న వేళ.. తమిళనాడు సీఎం పళనిసామి ఈ ఘటనపై స్పందించారు. తూత్తుకుడిలో స్టెరిలైట్ కాపర్ తయారీ ప్లాంటును మూసివేయాలంటూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టగా పోలీసులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.
మరోవైపు చెన్నైలోని తమిళనాడు అసెంబ్లీ వద్ద హైడ్రామా నడిచింది. తూత్తుకుడిలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో అధికారపక్షంపై డీఎంకే సహా విపక్షాలన్నీ భగ్గుమన్నాయి. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ నాయకత్వంలో ఆ పార్టీ శ్రేణులు గురువారం అసెంబ్లీ వద్ద మెరుపు ధర్నాకు దిగాయి.
తూత్తుకుడి స్టెరిలైట్ ప్రాజెక్టును మూసివేయాలంటూ ఆందోళన చేపట్టారు. పెద్ద సంఖ్యలో డీఎంకే శ్రేణులు అసెంబ్లీ వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో, స్టాలిన్ సహా పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి, అక్కడి నుంచి తరలించారు. ఈ నేపథ్యంలో, అక్కడ పోలీసులకు-డీఎంకే శ్రేణులకు మధ్య తోపులాట చేసుకుంది.