ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దిల్‌సుఖ్‌నగర్ బాంబుపేలుళ్ల కేసు దర్యాప్తును వేగవంతం చేసిన ఎన్ఐఏ... మిగతా కేసులను ఎందుకు పట్టించుకోవడంలేదన్నారు. మక్కామసీద్, అజ్మీర్ దర్గా, మాలేగావ్ పేలుళ్ల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. 2013లో దిల్‌సుఖ్‌నగర్‌లో పేలుళ్లు జరిగాయని చెప్పుకొచ్చారు.
ఈ ఘటనలో పలువురు చనిపోయారని, చాలామంది గయపడ్డారని, ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేసిందని... అలాగే మక్కా మసీదు పేలుళ్ల కేసును కూడా ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోందని, మాలేగావ్, అజ్మీర్ దర్గా పేలుళ్లు, సంఝౌతా ఘటన.. ఇవన్నీ ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోందని.. ప్రత్యేకంగా దిల్‌సుఖ్‌నగర్ కేసుపై ఎన్ఐఏ దృష్టి పెట్టిందని విమర్శలు గుప్పించారు.
1992లో బాబ్రీ మసీదును ధ్వంసం చేశారని, దానిపై దర్యాప్తుకే దిక్కులేదని చెప్పుకొచ్చారు. నిందితులు ముస్లిమేతరులు కావడంతో దర్యాప్తు సంస్థలు పట్టించుకోవడంలేని ఓవైసీ ఆరోపించారు. అన్ని ఉగ్రవాద దాడులను ఒకేలా ఎందుకు దర్యాప్తు చేయడంలేదంటూ ఆయన మండిపడ్డారు.
ఐపీఎస్ అధికారులు ప్రతి రోజూ జైలువద్దకు వెళ్లి నిందితుల వద్ద కుర్చున్నారని, దిల్‌సుఖ్‌నగర్ కేసులో మూడేళ్లలో తీర్పు వచ్చేసిందని, మరి మిగతా కేసుల్లో అంత శ్రద్ధ ఎందుకు చూపలేదని అసదుద్దీన్ ప్రశ్నించారు.