పుష్కరకాలం క్రితం దేశంలో సంచలనం సృష్టించిన కేసు బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్. ఈ కేసు ప్రధాన నిందితుడుగా ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన అరిజ్ ఖాన్ ఉన్నారు. అయితే, ఈ కేసులో ఢిల్లీ కోర్టు సోమవారం తీర్పును వెలువరించగా, ఉగ్రవాది అరిజ్ ఖాన్‌కు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అలాగే, రూ.11లక్షల జరిమానా కూడా విధించింది.
దేశ రాజధాని నగరంలోని కరోల్‌బాగ్, కన్నాట్‌ప్లేస్, గ్రేటర్ కైలాస్, ఇండియా గేట్ వద్ద బాంబు పేలుళ్లుకు తెగబడిన ఉగ్రవాదులు జామియా నగర్‌లోని ఎల్-18 బాట్లా హౌస్‌లో దాక్కున్నట్టు కేంద్ర నిఘా వర్గాలకు పోలీసులకు సమాచారం అందింది.
దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసుల బృందం బాట్లా హౌస్‌కు చేరుకోగా, పోలీసులను చూడగానే తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఘటనలో ఇన్‌స్పెక్టర్ మోహన్ చంద్ శర్మకు బుల్లెట్ తగలడంతో ఆయన వీరమరణం పొందారు.
ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ఆ సమయంలో అక్కడి నుంచి అరిజ్ ఖాన్, షాజాద్, జునైద్ తప్పించుకోగా.. మహ్మద్ సైఫ్ అనే మరో ముష్కరుడు పోలీసులకు లొంగిపోయాడు.