హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని రామ్‌పూర్ బుషహర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వాతంత్ర్య వీరుడు భగత్ సింగ్ వంశీయుడు అభిజిత్ సింగ్ సంధు దుర్మరణం పాలయ్యారు. ఈయన వయస్సు 27 యేళ్లు. స్వాతంత్ర్య పోరాటంలో చిరునవ్వుతో ఉరితాడును ముద్దాడిన భగత్ సింగ్‌కు మృతుడు అభిజిత్ సింగ్ సంధు మునిమనవడని అధికారులు వెల్లడించారు.
అభితేజ్ సింగ్ పనుల నిమిత్తం బయటకు వెళ్లాడు. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు తన మిత్రుడు సనావార్‌తో కలిసి బైక్‌పై బయలు దేరాడు. రామ్‌పూర్ సమీపంలోని మ్యాంగ్లాడ్ వద్ద వీరి బైక్ అదుపు తప్పడంతో వారు కిందపడ్డారు. దీంతో, అభితేజ్ సింగ్ తలకు, పక్కటెముకలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.
పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అతని కుటుంబసభ్యులకు అప్పగించారు. మొహాలీలో రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా అభితేజ్ సింగ్ మిత్రులు గురుపాల్ సింగ్ మాట్లాడుతూ, ఈ ప్రమాదం జరిగినప్పుడు వారి బైక్ వెనకాలే తాను, ఇంకొక మిత్రుడు కలిసి కారులో వెళుతున్నానని, రోడ్డు తడిగా ఉండటం కారణంగా ఈ సంఘటన జరిగిందని అన్నారు. అభిజిత్ సింగ్ పీపుల్స్ పార్టీ యువనేతగా ఉన్నారు. ఆయన మృతికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంతాపం వెలిబుచ్చారు.