ఇదే అంశంపై స్వామి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, తిరుమలలో అన్యమత ప్రచారం జరగలేదని, జగన్‌పై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. గతంలో కంటే కూడా తిరుమలలో ఏర్పాట్లు బాగున్నాయని, భవిష్యత్తులో మరిన్ని మంచి మార్పులు ఆశించవచ్చునని అన్నారు.
ఇకపోతే, తిరుమల ప్రధాన అర్చకుడిని రిటైర్మెంట్ పేరుతో గత ప్రభుత్వం తొలగిస్తే, జగన్ తిరిగి ప్రధాన అర్చకుడిగా రమణదీక్షితులను నియమించారని, ఇది మంచి శుభపరిణామం అని చెప్పారు. అలానే తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతుందని ఆరోపించిన వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని సుబ్రహ్మణ్య స్వామి చెప్పడం విశేషం. టీటీడీ పాలకమండలి స్వతంత్రంగా వ్యవహరిస్తోందని అన్నారు. అక్కడ అన్యమత ప్రచారం జరిగితే మొదట తానే స్పందిస్తానని చెప్పారు.
అలాగే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులపైన ప్రియాంక గాంధీనే దాడి చేసిందని, ఆమెపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పౌరసత్వ సవరణ చట్టం గురించి ఆయన ప్రస్తావిస్తూ, మతపరమైన ఇబ్బందుల కారణంగా పాకిస్థాన్ నుంచి వచ్చిన 30 వేల మంది హిందువుల కోసమే సీఏఏ చట్టం తీసుకొచ్చామని చెప్పారు. పాకిస్థాన్ నుంచి వచ్చిన ఏ ముస్లిం మతపరమైన ఇబ్బందులతో ఇక్కడికి రాలేదని స్వామి గుర్తుచేశారు.