మైనింగ్ కింగ్, మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి పాతనోట్ల మార్పిడి వ్యవహారం తీగలాగితే డొంక కదులుతోంది. ఈ కేసులో భాగంగా బళ్లారి బీజేపీ ఎంపీ శ్రీరాములు గన్‌మెన్ చెన్న బసప్ప హోసమనిని సీఐడీ అదుపులోకి తీసుకుంది. కర్ణాటక రెవెన్యూ అధికారి భీమానాయక్ కారు డ్రైవర్ రమేష్ గౌడ సూసైడ్ కేసుని సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా.. గాలి జనార్థన్‌రెడ్డి కూతురు పెళ్ళికి ముందు ఆయనకు సంబంధించిన 100 కోట్ల పాత కరెన్సీని కొత్త నోట్లుగా రెవెన్యూ అధికారి భీమానాయక్ మార్చాడని, దీని నిమిత్తం 20 శాతం కమీషన్‌గా ఆయనకు ముట్టిందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తనను చంపుతామని బెదిరించారని, ఈ వేధింపులు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నట్లు డ్రైవర్ రమేష్ గౌడ తన లేఖలో ప్రస్తావించడంతో గాలి జనార్ధన్ రెడ్డికి గుబులు మొదలైంది.