వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాలో ఉండే బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్య స్వామి మరోమారు నోరు పారేసుకున్నారు. ఆత్మహత్య చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని, ఇదే జరిగితే ఆ పార్టీ అంత్యక్రియలు తామే నిర్వహించాల్సి ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలపై ఆయన సోమవారం మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ కొండత ఆశలు పెట్టుకుందన్నారు. కానీ, యూపీ ఓటర్లు మాత్రం ఆ పార్టీ ఇకపై కోలుకోలేనివిధంగా తీర్పునిచ్చారన్నారు. ఈ ఫలితలతో కాంగ్రెస్ పార్టీ డీలా పడిపోయిందన్నారు.
అంతేకాకుండా, కాంగ్రెస్ పార్టీలో రాజీవ్ గాంధీ ఒక్కరే మంచి నేత అని ఆయన వ్యాఖ్యానించారు. ఎందుకంటే రాజీవ్ ఒక్కరే హిందువులను జాగృత పరచడానికి ఎంతో పాటుపడ్డారన్నారు. ఆ నాడు కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించినప్పటికీ హిందువుల పౌరాణిక ధారవాహిక రామాయణంను దూరదర్శన్‌లో ప్రసారం చేయడానికి ఆయన అంగీకరించారని సుబ్రమణ్య స్వామి గుర్తు చేశారు.