బీజేపీ అధినేతగా అమిత్ షా.. కాషాయ శ్రేణుల సంబరాలు!

బుధవారం, 9 జులై 2014 (15:12 IST)
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షా ఎన్నిక కావడంతో దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు.. హైదరాబాద్లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు మిన్నంటాయి. బీజేపీ సీనియర్ నేతలు, కార్యకర్తలు మిఠాయిలు పంచుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన వేడుకల్లో బీజేపీ సీనియర్ నేతలు డాక్టర్ లక్ష్మణ్, ఎన్. ఇంద్రసేనారెడ్డి, సీహెచ్ విద్యాసాగర్ రావులు పాల్గొన్నారు. 
 
ఈ సంర్భంగా వారు మాట్లాడుతూ... అమిత్ షా సారథ్యంలో బీజేపీ దేశంలో మరింత బలపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాలలో బీజేపీ అధికారం చేపడుతుందని వారు జోస్యం చెప్పారు. అలాగే, ఢిల్లీతో పాటు.. అమిత్ షా సొంత రాష్ట్రమైన మహారాష్ట్రలో కూడా బీజేపీ శ్రేణులు బాణాసంచా పేల్చుతూ సంబరాలు జరుపుకున్నారు. 
 
అమిత్ షా నేపథ్యం ఇదీ.. అమిత్ షా పూర్తి పేరు అమిత్ భాయ్ అనిల్ చంద్రా షా. 1964 అక్టోబర్ 22వ తేదీన మహారాష్ట్రలో జన్మించిన ఈయన... ఆది నుంచి ఆర్ఎస్ఎస్‌తో పరిచయం ఉంది. ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, బీజేవైఎంలలో చురుగ్గా పని చేశారు. 1997లో తొలిసారి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొత్తం ఆయన ఐదుసార్లు శాసనసభ్యునిగా గెలుపొందారు. గుజరాత్ ప్రభుత్వంలో పలు కీలక శాఖలు చేపట్టారు. హోం, న్యాయ, శాంతిభద్రతలు, ఎక్సైజ్, రవాణా శాఖ తదితరాలను ఆయన నిర్వహించారు. 
 
ఆ తర్వాత అమిత్ షా 1986లో బీజేపీలో చేరారు. 1997లో సార్‌కేజ్ నుండి తొలిసారి గెలుపొందారు. ఇటీవల జరిగి సార్వత్రిక ఎన్నికలలో ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ 80 స్థానాలకు గాను 72 స్థానాల్లో గెలిచింది. ఈ క్రెడిట్ అమిత్ షాదే. యూపీ ఫలితాలతో ఆయన జాతీయ దృష్టిని ఆకర్షించారు. అయితే, గోద్రా అల్లర్లు, సోహ్రబుద్దీన్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసులు ఆయన పైన ఉన్నాయి. 2003 నుండి 2010 వరకు మోడీ కేబినెట్లో మంత్రిగా పని చేశారు. జైన మతానికి చెందిన అమిత్ షాకు భార్య సోనాల్ షా. ఒక కొడుకు జై షా ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి