ప్రపంచ ఆర్థిక మాంద్యం నుంచి భారత్‌ను నల్లధనమే రక్షించిదని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఇండో-మయన్మార్-థాయిలాండ్ స్నేహపూర్వక కారు ర్యాలీ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, నల్లధనానికి తాను వ్యతిరేకమని అన్నారు. తనకు నల్లధనం వద్దని చెప్పారు. అయితే దేశంలో ఆర్థిక వ్యవస్థకు సమాంతరంగా ఉన్న నల్లధనమే మన దేశాన్ని ఆర్థిక మాంద్యంలోనూ తట్టుకోగలిగేలా చేసిందని ఎందరో ఆర్థికవేత్తలు చెబుతున్నారని ఆయన గుర్తుచేశారు.
ఆర్థిక మాంద్యం సమయంలో ప్రపంచ దేశాలన్నీ కుదేలైపోతే మనదేశాన్ని మాత్రం నల్లధనమే కాపాడిందన్నారు. నల్లధనం నిర్మూలనకు కేంద్రం తీసుకున్న ఆకస్మిక నిర్ణయం కారణంగా బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలు మాత్రమే మిగిలాయన్నారు. పెద్ద నోట్లు రద్దు చేసినంత మాత్రాన నల్లధనాన్ని నియంత్రించలేమన్నారు. ఈ నల్లధనం రద్దు ఎఫెక్టు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలపై ఎంతమాత్రం ప్రభావం చూపదని ఆయన అభిప్రాయపడ్డారు.