సంపూర్ణ మెజార్టీ లేకపోయినప్పటికీ.. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీఎస్.యడ్యూరప్పతో ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ వాలా ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో కర్ణాటక రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప గురువారం ఉదయం 9 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. సభలో బలపరీక్ష తర్వాత మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. అయితే, యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా కొనసాగుతారా? లేదా యడ్డీ సర్కారు బలపరీక్షలో ఏ విధంగా ఎదుర్కొంటుందన్న సందేహాలు ఇపుడు ఉత్పన్నమవుతున్నాయి.
ప్రస్తుతం యడ్యూరప్పకు ఏకంగా 15 రోజుల గడువిచ్చారు. ఇది చాలు.. బీజేపీ తనకు తక్కువైన 8 మంది మద్దతు కూడగట్టుకోడానికి. ప్రస్తుతం కమలానికి 104 మంది సభ్యులే ఉన్నారు. ఇద్దరు స్వతంత్రులు కూడా కాంగ్రెస్ వైపు వెళ్లారు. కాంగ్రెస్‌కు లభించిన 78 స్థానాలు, జేడీఎస్ 38 స్థానాలు కలుపుకొంటే మెజార్టీ 118గా ఉంది. మ్యాజిక్ నెంబర్ 112 కంటే ఇది 6 స్థానాలు ఎక్కువే. ఈ లెక్కన కాంగ్రెస్, జేడీఎస్ కూటమికి స్పష్టమైన మెజార్టీ ఉంది.
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా లు కలిసి యడ్యూరప్ప సర్కారును నిలబెట్టేందుకు ఓ వ్యూహం రచించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను రాజకీయ విశ్లేషకులు కూడా ధృవీకరిస్తున్నారు. ఆ వ్యూహం ఏంటంటే...
అయితే, రెండు నియోజకవర్గాల నుంచి ఎన్నికైన జేడీఎస్ నేత కుమారస్వామి ఒకచోట రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన శాసనసభకు ఎన్నికలు జరిగిన స్థానాల సంఖ్య 221కి పడిపోతుంది. మ్యాజిక్ నెంబర్ సంఖ్య కూడా 111కి మారుతుంది. బలనిరూపణ సమయంలో కొందరు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యేలా చేస్తే యడ్యూరప్ప ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గుతుంది.