'బీఎస్ యడ్యూరప్ప అనే నేను'... కర్ణాటక ముఖ్యమంత్రిగా...

గురువారం, 17 మే 2018 (09:16 IST)
బీఎస్ యడ్యూరప్ప అనే నేను కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అంటూ యడ్యూరప్ప కన్నడ రాష్ట్ర సీఎంగా గురువారం ఉదయం 9 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ వాలా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ దూతగా కేంద్ర మంత్రులు ప్రకాష్ జావదేకర్, జేపీ నడ్డా, సదానంద గౌడ హాజరయ్యారు.
 
కాగా, కన్నడనాట జరుగుతున్న రాజకీయ పరిణామాలు, పూర్తి మెజారిటీ లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి రావడం తదితర కారణాలతో యడ్యూరప్ప సీఎం పీఠాన్ని అధిరోహించే కార్యక్రమానికి సాధ్యమైనంత దూరంగా ఉంటేనే మంచిదని బీజేపీ అగ్రనేతలు భావించినట్టు తెలుస్తోంది. అందుకే సీనియర్ నేతలెవ్వరూ హాజరుకాలేదు. కాగా, రాజ్‌భవన్‌లో నిర్వహించే ఈ కార్యక్రమం జరిగింది. 
 
కాగా, తాను 17వ తేదీన సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని యడ్యూరప్ప నాలుగు రోజుల క్రితమే వెల్లడించిన సంగతి తెలిసిందే. 15న తన గెలుపు ఖాయమని, అదే రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లి ప్రధానిని, తమ పార్టీ అధ్యక్షుడిని కలిసి ఆయన్ను ఆహ్వానిస్తానని వెల్లడించిన యడ్యూరప్ప, ప్రస్తుత పరిస్థితుల్లో వారితో ఫోన్‌లో మాట్లాడారే తప్ప ఢిల్లీకి వెళ్లలేదు. 
 
మరోవైపు, 104 సీట్లు మాత్రమే ఉన్న బీజేపీకి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలంటే మరో 8 మంది సభ్యుల మద్దతు అవసరం. కానీ, ఇవేమీ పట్టించుకోకుండా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. పైగా, బలనిరూపణకు ఈనెల 21వ తేదీ వరకు గడువు ఇచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు