ఆంధ్రప్రదేశ్ - బీహార్ రాష్ట్రాలకు కేంద్రం పెద్ద పీట - వార్షిక బడ్జెట్‌లో వరాల జల్లు!!

వరుణ్

మంగళవారం, 23 జులై 2024 (15:40 IST)
కేంద్రంలో ఏర్పాటైన నరేంద్ర మోడీ 3.0 ప్రభుత్వంలో ఇటు టీడీపీ, అటు జేడీయు పార్టీలు కీలక పాత్రను పోషిస్తున్నాయి. ఈ రెండు పార్టీల మద్దతుతోనే మోడీ సర్కారు కేంద్రంలో మనుగడ ఆధారపడివుంది. దీంతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో బీహార్, ఏపీలకు పెద్దపీట వేశారు. ఈ రెండు రాష్ట్రాల అభివృద్ధికి భారీగా నిధులను కేటాయించారు. 
 
తమకు ప్రత్యేక ఇవ్వాలని జేడీయు అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆచితూచి వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో సంకీర్ణ ధర్మాన్ని పాటించిన మోడీ ప్రభుత్వం రెండు రాష్ట్రాలకు బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించింది. బిహార్‌కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చిచెప్పిన కేంద్రం.. బడ్జెట్‌లో మాత్రం అధిక కేటాయింపులతో శాంతపరిచే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో తాజా బడ్జెట్‌లో రెండు రాష్ట్రాలల్లో అభివృద్ధి ప్రాజెక్టులకు భారీగా నిధుల కేటాయింపులు ఇచ్చింది. 
 
ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖావృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని చెబుతోన్న కేంద్ర ప్రభుత్రం ఆ దిశగా అడుగులు వేసినట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలుకు కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించింది. రాష్ట్రానికి రాజధాని అవసరాన్ని గుర్తించి.. అమరావతికి రూ.15వేల కోట్ల ప్రత్యేక సాయాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలోనే అందిస్తామని తెలిపింది. అవసరాన్ని బట్టి వివిధ ఏజెన్సీల ద్వారా మరిన్ని నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టును కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తామని పేర్కొంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేయనున్నట్లు బడ్జెట్లో ప్రకటించింది.
 
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి మరింత ఊతమిచ్చేందుకు గాను అవసరమైన నీటి, విద్యుత్, రైల్వే, రోడ్డు ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటితోపాటు ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లోని వెనకబడిన ప్రాంతాలకు గ్రాంట్లు ఇస్తామని తెలిపింది. విశాఖ- చెన్నై కారిడార్లో కొప్పర్తికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
 
అదేవిధంగా బిహార్ రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి కోసం కేంద్రం భారీగా కేటాయింపులు జరిపింది. ఇందుకోసం మొత్తంగా రూ.26 వేల కోట్ల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది. జాతీయ రహదారుల కోసమే రూ.20 వేల కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించింది. పాట్నా - పూర్నియాలను  అనుసంధానం చేస్తూ ఎక్స్‌ప్రెస్ హైవేను అభివృద్ధి చేస్తామని పేర్కొంది. బక్సర్ - భాగల్పుర్, బోధయా - రాజ్‌ఘర్ - వైశాలీ దర్భంగాలను కలుపుతామని తెలిపింది. 
 
బక్సర్ జిల్లాలో గంగానదిపై రెండు లైన్ల వంతెన నిర్మాణం, భాగల్పుర్‍‌లోని పిపౌంతీలో రూ.21,400 కోట్ల అంచనాతో 2400 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటు, రాష్ట్రంలో పర్యటకాన్ని మరింత అభివృద్ధి చేయడంలో భాగంగా గయ, రాజిన్లలో టెంపుల్ కారిడార్ల అభివృద్ధితోపాటు వరదల నుంచి రాష్ట్రాలన్ని రక్షించేందుకు గాను రూ.11,500 కోట్లతో వరదల నియంత్రణ నిర్మాణాలు చేపడతామని హామీ ఇచ్చింది. పర్యటక కేంద్రంగా నలందా అభివృద్ధి, ఎయిర్ పోర్టులు, మెడికల్ కాలేజీలు, క్రీడా రంగంలో మౌలిక సదుపాయాల కల్పన కృషి చేస్తామని తెలిపింది. మొత్తంగా బహుపాక్షిక అభివృద్ధి ఏజెన్సీల ద్వారా రాష్ట్రానికి ఆర్థిక సాయం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు